
త్వరలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు
● ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు కోసం భూమి కేటాయింపులు 90% పూర్తయ్యాయని..త్వరలో ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి శ్మశాన వాటిక పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నూతన ఎస్టీపీ ప్లాంట్ల కు సంబంధించి వివాదాలకు తావు లేకుండా భూ కేటాయింపులు చేశామన్నారు. నియోజకవర్గ పరిధి లోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిశాట్, గండిగూడెం, బచ్చుగూడెం, అమీన్‌పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 1,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రజల కోసం 3 ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం 1.71కోట్లతో నిర్మించిన శ్మశాన వాటికలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సమావేశంలో జలమండలి ఎస్టీపీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ పద్మజ, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.