
ప్రణాళిక.. ప్రహసనం
కానరాని కార్యాచరణ – ఎక్కడి చెత్త అక్కడే
● మున్సిపాలిటీల్లో తాండవం చేస్తున్న సమస్యలు ● విఫలమైన అధికారులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
జోగిపేట(అందోల్): పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో గల పార్కు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ పార్కు మున్సిపల్ కార్యాలయం ప్రక్కనే ఉండటం గమనార్హం. గాంధీ పార్కుకు తాళం వేయడం వల్ల అందులో చెత్త పేరుకుపోయింది. జోగిపేట–అన్నాసాగర్ వెళ్లే రహదారి ప్రక్కనే చెత్త పేరుకుపోయింది. వంద రోజుల ప్రణాళిక తూతూ మంత్రంగా నిర్వహించారని పలువురు ఆరోపిస్తున్నారు. 20 వార్డులను టార్గెట్ చేసి పనులు చేపట్టినా పారిశుధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు.
ప్రణాళిక అమలేది?
మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ మొక్కుబడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పట్టణంలోని చెరువులు, ఎంఎన్ కెనాల్ పారిశుద్ధ్య లోపంతో కంపుకొడుతున్నాయి. మల్లం చెరువు కట్టపై చెత్త పేరుకుపోయింది. ఎంఎన్ కెనాల్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిపోయి కంపు కొడుతోంది. కాలనీల్లోని మురుగు కాల్వలు సైతం ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పురపాలికల్లో వందరోజుల ప్రణాళిక సరిగా అమలవ్వడం లేదు. వెరసి మురుగునీటి కాలువల అపరిశుభ్రత, చెత్త తరలింపులో నిర్లక్ష్యం, మురుగు గుంతలు, దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు, తదితర పనులు చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు పకడ్బందీ ప్రణాళికతో మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
వృద్ధి చెందుతున్న దోమలు
నర్సాపూర్: మున్సిపాలిటీలో మురికి కాలువల శుభ్రం, పిచ్చి మొక్కలు తొలగింపు, భగీరథ పథకం నీటి ట్యాంకుల క్లోరినేషన్ చేయడం తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ పనులను సక్రమంగా చేపట్టక పోవడం గమనార్హం. పిల్లల పార్కులోని మిషన్ భగీరథ ట్యాంకు నీరు లీకవుతుంది. వాల్వుల వద్ద మురికి కూపంగా తయారైంది. సునీతారెడ్డి కాలనీలో డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరు నేలపై పారి పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు పెరగుతున్నాయని కాలనీవాసులు చెప్పారు
దుబ్బాక: మున్సిపాలిటీలోని 20 వార్డులలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం డ్రైనేజీ శుభ్రం చేసే పనులు కూడా సరిగా చేయడం లేదు. వార్డులలో ప్రజలకు తడి,పొడి చెత్త, వానాకాలంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూ.20 కోట్ల నిధులు వస్తే సమస్యలు తీరుతాయని, అవి లేకే సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉన్న సమస్యలు అధికారులు నోటీఫై చేసుకుంటున్నప్పటికీ అవి ఎంత వరకు పరిష్కారం అవుతాయో.. చూడాలని ప్రజలు వాపోతున్నారు.
పారిశుధ్య పనుల్లో నిర్వహణ లోపం..
అవగాహన కల్పిస్తే.. ఇలా చేస్తారా?
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నామమాత్రంగా ప్రణాళిక నిర్వహిస్తున్నారు. మొత్తం యాక్షన్‌ప్లాన్‌లో 50 అంశాల్లో పారిశుద్ధ్యం ఒకటి. తడి, పొడి చెత్తపై మాత్రం అవగాహన కూడా కల్పించడం లేదు. పలుచోట్ల చెత్తను బహిరంగంగా తగలబెడుతున్నారు. పారిశుద్ధ్యంపై కాలనీలు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ మున్సిపల్ పరిధిలో అమలు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రణాళిక.. ప్రహసనం

ప్రణాళిక.. ప్రహసనం

ప్రణాళిక.. ప్రహసనం

ప్రణాళిక.. ప్రహసనం

ప్రణాళిక.. ప్రహసనం