
ఇళ్లు కూలగొట్టి రోడ్డున పడేశారు
● పెట్రోలు డబ్బాతో దివ్యాంగుడి ఆందోళన ● డబుల్ బెడ్రూం నుంచి వెళ్లిపోవాలని లబ్ధిదారుల ఒత్తిడి
గజ్వేల్‌రూరల్: రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించిన గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోకుండా తాత్కాలికంగా డబుల్ బెడ్రూంలను కేటాయించి చేతులు దులుపుకున్నదని బాధితులు పేర్కొన్నారు. పెట్రోల్ డబ్బా పట్టుకొని ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ దివ్యాంగుడు ఆందోళనకు దిగాడు. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో రోడ్డు వెడల్పులో భాగంగా గత ప్రభుత్వ పాలనలో 19 మందికి చెందిన ఇళ్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమవగా, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి బాధితులకు నచ్చజెప్పి సంగాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి పంపించారు. అక్కడ మొదటి అంతస్తులో ఇళ్లు కేటాయించారు. కానీ, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 9 మంది బాధితులకు ఉండేందుకు అనుమతించారు. కాగా డబుల్ లబ్ధిదారులు వచ్చి ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నా రని, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధిత దివ్యాంగుడు నాగరాజు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టెను చేతిలో పట్టుకొని ఆందోళనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న సీఐ సైదా ఘటనా స్థలానికి వెళ్లి నచ్చ జెప్పారు. బాధితులందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాగరాజు మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించారని, ప్రస్తుత ప్రభుత్వం ఆదుకొని గూడు కల్పించాలని కోరాడు.