
చెరువులో పడి వృద్ధురాలి మృతి
● కుమారులు సరిగా చూడటం లేదనా.. ● అనారోగ్య సమస్యతో ఆత్మహత్యనా?
అక్కన్నపేట(హుస్నాబాద్): చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన గురువారం సాయంత్రం మండలంలోని అంతక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పూదరి కనకవ్వ(70)కు నలుగురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు కరీంనగర్‌లో ఉంటున్నాడు. మిగిలిన కుమారుల వద్ద ఆమె ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కుమారులు సరిగా పట్టించుకోకపోవడంతో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అనార్యోగ సమస్య తట్టుకోలేకనా? లేక కుమారులు సరిగా చూడటం లేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. వృద్ధురాలి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సాక్షి ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌ను సంప్రందించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
కౌడిపల్లి(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తునికిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎతిరాజుల సుశీలకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా చిన్న కొడుకు యాదగిరి(32) తునికిలో తల్లి వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. తల్లి కూలీపనులు చేస్తూ పోషిస్తుంది. పలుమార్లు మద్యం సేవించి తల్లితో సైతం గొడవపడేవాడు. గురువారం తల్లి గ్రామంలోకి వెళ్లొచ్చేసరికి ఇంట్లో యాదగిరి ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య పదేళ్లక్రితం చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.