
లోన్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు
సైబర్ నేరస్తుడి అరెస్ట్
చేర్యాల(సిద్దిపేట): లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ ఎల్.శ్రీను, ఎస్‌ఐ పి.నీరేష్ కేసు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుగొండ మండలానికి చెందిన పిల్లెల శ్రీకాంత్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందులో చేరేలాగా చేసిన శ్రీకాంత్ జాతీయ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి రుణాలు వస్తాయని, అందుకు సభ్యత్వ రుసుము రూ. 25 వేలు చెల్లించాలని గ్రూపులో పోస్ట్ చేశాడు. ఇది నిజమేనని నమ్మిన మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు లోన్ కావాలని వాట్సాప్‌లో అడిగాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి సభ్యత్వ రుసుము రూ.25వేలు పంపించాలని శ్రీకాంత్ కోరాడు. సదరు వ్యక్తి గూగుల్‌పే ద్వారా రూ.25 వేలు రెండు విడతల్లో పంపించాడు. ఫోన్‌చేస్తే ఎత్తకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నేరస్తుడిని అరెస్టు చేశారు.