
దరఖాస్తుల విచారణ వేగిరం
● కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి
సంగారెడ్డి జోన్: ప్రజాపాలన, మీ సేవ ద్వారా అందిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం సేకరణ, సీఎంఆర్ డెలివరీ, రేషన్ పంపిణీ, పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంతకుముందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి సంగారెడ్డి ఐబీ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు, కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులలో నిఘా విభాగాన్ని అప్రమత్తం చేసి మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2023–24 రబీ సీజన్ కింద తొమ్మిది మిల్లుల నుంచి సరఫరా కావలసిన సీఎంఆర్ తక్షణమే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు, విద్యాశాఖతో సమన్వయంతో గ్యాస్ కనెక్షన్ల కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.