
టాక్స్ చెల్లించకుంటే జరిమాన
● 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు ● జహీరాబాద్ ఎంవీఐ వెంకటయ్య
జహీరాబాద్ టౌన్:
సాక్షి: జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి. బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాయా?
ఎంవీఐ: జహీరాబాద్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు వస్తాయి. డివిజన్ వ్యాప్తంగా 218 ప్రైవేట్ స్కూల్ బస్సులున్నాయి. ఇప్పటి వరకు 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాం. మిగిలిన బస్సులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
సాక్షి: నిబంధనలు పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఎంవీఐ: నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం. ఫిట్‌నెస్‌తోపాటు టాక్స్ కట్టని బస్సులకు రూ.5 వేల వరకు జరిమాన విధిస్తాం.
సాక్షి: ఆటోల్లో పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లవచ్చా?
ఎంవీఐ: నిబంధన ప్రకారం ఆటోలో విద్యార్థులను తీసుకెళ్లకూడదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే సామర్థ్యం మేరకు పిల్లలను కూర్చో బెట్టాలి. స్కూల్ ట్రిప్ అని ముందు వెనుక రాయాలి. నిబంధనలు పాటించకుండా నడిపితే కేసులు పెడతాం.
సాక్షి: డ్రైవర్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి?
ఎంవీఐ: డ్రైవర్‌కు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 60 సంవత్సరాల లోపు ఉండాలి. తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. డ్రైవర్‌కు కచ్చితంగా సహాయకుడు ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.
ఎం.వెంకటయ్య, ఎంవీఐ, జహీరాబాద్
సాక్షి: బస్సుల ఫిట్‌నెస్ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఎంవీఐ: బస్సు పూర్తిగా కండిషన్‌లో ఉండాలి. బస్సు టైర్లు, బ్రేకులు, సీట్లు, ఫుట్‌బోర్డు, ఫస్ట్ ఎయిడ్ కిట్, పాఠశాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలిస్తాం. బస్సుపై పాఠశాల పేరు, సెల్‌ఫోన్ నంబర్ కచ్చితంగా ఉండాలి. నిబంధనలు పాటించకుంటే బస్సులకు అనుమతులు ఇవ్వం.