
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
ముత్తంగి పాఠశాల భవనంప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతోపాటు..నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి దత్తాత్రేయనగర్ కాలనీలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రూ.2.50కోట్ల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేటి తరం తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నెలకొన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు కల్పించామన్నారు. నియోజకవర్గంలో నూతన పాఠశాలల భవన నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న గ్లాండ్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పటాన్‌చెరు నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే గూడెం కోరారు. కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సీఎస్‌ఆర్ హెడ్ రఘురామన్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.