
భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
● చెదరగొట్టిన పోలీసులు ● పూరిగుడిసెను దహనం చేశారని ఫిర్యాదు
చిన్నశంకరంపేట(మెదక్): భూ వివాదం ముదిరి అనుమానాస్పదంగా పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ ఘటనపై మండలంలోని సంగాయిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య అదే గ్రామానికి చెందిన చల్ల సాయిలు వద్ద 4 గుంటల పొలం 2013లో కొనుగోలు చేశాడు. ఈ భూమిలో గుడిసేవేసి తన కూతురు నర్సమ్మను ఉంచాడు. ఈ భూమి విషయంలో సాయిలు కుమారులు చల్ల రాజు, నవీన్ నర్సమ్మతో మంగళవారం మధ్యాహ్నం గొడవపడ్డారు. దీంతో నర్సమ్మ తనతల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇదే సమయంలో బుధవారం తెల్లవారుజామున నర్సమ్మ పూరిగుడిసె అనుమానాస్పదంగా దగ్ధమైంది. కాగా తన కూతరు గుడిసెను చల్ల రాజు, నవీన్ తగలబెట్టడంతో పాటు దాడిచేశారని పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు.