
పక్కా భవనాల్లో పంచాయతీలు
ఉపాధి హామీ పథకం ద్వారా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పనులు చేపడుతూ పలు సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా పక్కా భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు గాను కూలీలకు పనికల్పిస్తూ డబ్బులు చెల్లించడంతోపాటు మెటిరీయల్ కాంపోనెంట్ ద్వారా భవనాల నిర్మాణాలను చేపట్టనున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
– నారాయణఖేడ్:
యూనిక్ మోడల్‌గా భవనాలు
నూతనంగా నిర్మించనున్న అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు యూనిక్ మోడల్‌గా ఉండాలని ఆశాఖ మంత్రి సీతక్క ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ భవనాలను ప్రజలు చూడగానే అవి గ్రామ పంచాయతీ భవనాలు అని, ఇవి అంగన్‌వాడీ భవనాలుగా గుర్తించేలా ఉండేలా డిజైన్ రూపొందించాలని సూచించారు.
గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి రెండు నెలల క్రితమే అధికారులు ప్రతిపాదనలు పంపించగా పలు భవనాలకు నిధుల మంజూరు లభించింది. కాగా ప్రతీ మండలంలో రెండేసి చొప్పున గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పనులకు సంబంధించి ఏయే మండలాల్లో నిర్మిస్తున్నా రో అందుకు సంబంధించి స్థలసేకరణ చేపట్టి నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. రూ.20లక్షల వ్యయంతో ఒక్కో పంచాయతీ భవనం నిర్మించనుండగా, ఒక్కో అంగన్‌వాడీ భవనానికి ఉపాధి నిధులు రూ.8లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2లక్షలు, మహిళా, శిశు సంక్షేమం నుంచి రూ.2లక్షలు కలిపి రూ.12లక్షలతో వెచ్చించనున్నారు. ఈ భవనాల నిర్మాణాలకు సంబంధించి నెలాఖరులో శంఖుస్థాపనలు చేసి మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
స్థలాల గుర్తింపులో జాప్యం కారణంగా
జిల్లాలో 27 మండలాలకు గాను 54 చొప్పున అంగన్‌వాడీలు, మరో 54 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాల్సి ఉంది. భవన నిర్మాణాల కోసం గత నవంబర్‌లోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం నిర్దేశించుకోగా స్థలాల గుర్తింపు, అప్పగింతలో జాప్యం కారణంగా అనుకున్నస్థాయిలో భవనాల నిర్మాణాలు జరగలేదు. ఆ అనుభవాల దృష్ట్యా మండలానికి రెండు చొప్పున జీపీలు, అంగన్‌వాడీలను నిర్ణయించి స్థలాల ఎంపికను వేగంగా పూర్తి చేయాలనుకుంటోంది.
చెట్లకింద పాలన
జిల్లాలో 631 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పక్కా భవనాలు 412 గ్రామ పంచాయతీలకు మాత్రమే. 219 పంచాయతీలకు భవనాలు లేవు. పాఠశాలలు, చావిడీలు, కమ్యూనిటీ భవనాలు, చెట్లకింద పాలన సాగుతోంది. జిల్లాలో కొత్తగా 11 పంచాయతీలు ఏర్పాటు కాగా అవికూడా చెట్లకింద పాలనగానే ఉన్నాయి. మండలానికి రెండు చొప్పున 54 భవనాలు నిర్మాణం జరిగితే కొంత వెసులుబాటు కానుంది. జిల్లాలో ఐదు అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో సొంత భవనాలు 509 అంగన్‌వాడీలకు మాత్రమే ఉన్నాయి. 528 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉచిత భవనాల్లో 466 ఉన్నాయి.
మండలానికి రెండేసి చొప్పున నిర్మాణం
జిల్లాకు 27 జీపీలు,
62 అంగన్‌వాడీలు మంజూరు
మరో 27 జీపీలకు
గుర్తించనున్న స్థలాలు
నెలాఖరులోగా స్థలాల ఎంపిక..
పనులు ప్రారంభం
వచ్చే మార్చి నాటికి
అందుబాటులోకి భవనాలు
భవనాల నిర్మాణాలకు చర్యలు
ప్రభుత్వం ప్రతీ మండలానికి రెండు చొప్పున గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని ఆదేశించింది. ఉపాధి కూలీల ద్వారా పనులు కల్పిస్తూ మెటీరియల్ కాంపోనెంట్ మంజూరు చేస్తూ నిర్మాణాలు చేపడతాం.
– బాల్‌రాజ్, అదనపు పీడీ,
డీఆర్‌డీఏ, సంగారెడ్డి

పక్కా భవనాల్లో పంచాయతీలు