
పంచాయతీ పోరు
మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ
● ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు
● రిజర్వేషన్లు తేలకపోవడంతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ
● కోర్టు తాజా ఆదేశాలతో వేడెక్కనున్న పల్లె రాజకీయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పల్లె రాజకీయ మళ్లీ వేడెక్కనుంది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మళ్లీ మద్దతు కోసం మంతనాలు ప్రారంభించనున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఆశావహులు ప్రత్యక్ష కార్యచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వేషన్ తమ అనుకూలంగా వస్తే..అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటినుంచి మద్దతు కోసం కార్యాచరణ ప్రారంభిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయని..తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఖర్చులన్నీ వృథా అవుతాయనే ఆలోచనలో చోటా మోటా నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసిన విషయం విదితమే. అప్పట్నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి
ఈ ఎన్నికలను ఆరు నెలల క్రితమే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జనవరిలో చకచకా ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను కూడా సిద్ధం చేసింది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను జిల్లాకు తెప్పించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా గుర్తించారు. స్టేజ్–1, స్టేజ్–2 ఇలా వివిధ స్థాయిల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఆయా స్థాయిల్లోని అధికారులను, సిబ్బంది జాబితాను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు తీరా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఈ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నం కానుంది.
ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకమే..
గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తమ అనుచరులనే సర్పంచులుగా గెలిపించుకుంటేనే ఆయా గ్రామాల్లో నియోజకవర్గస్థాయి నాయకులకు పట్టు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దింపేందుకు ఇప్పట్నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు.