
సమస్యలు పరిష్కారం
విద్యా వ్యవస్థ పటిష్టంతోనే
సంగారెడ్డి/జోగిపేట(అందోల్)/పాపన్నపేట(మెదక్): విద్యా వ్యవస్థ పటిష్టమైతేనే దేశంలో ఏ సమస్యకై నా సరైన పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ కళాశాలను, అందోలులోని గురుకుల పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. అంతకుముందు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో ఇప్పటివరకు 26 గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికను అందజేశామన్నారు. తెలంగాణలో ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే భరించలేరన్నారు. గురుకుల పాఠశాలలో బోధన, భోజనం ఎలా ఉందని అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు. వెంకటయ్య వెంట ఆర్డీఓ పాండు, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్‌రెడ్డిలతోపాటు కళాశాల, గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు.
సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకూడదు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలను జూలై 30వ తేదీ నాటికి పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ...ప్రతీ నెల అన్ని మండలాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే వినియోగించాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. సమీక్షలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య