
పీఆర్ శాఖలోనే కార్యదర్శులు
సంగారెడ్డి జోన్: జిల్లాలో మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయతీల కార్యదర్శులు పంచాయతీ రాజ్ శాఖలోనే కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంతోపాటుగా పలు గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేసింది. పంచాయతీలను విలీనం చేసినప్పటికీ సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలోనే విధులు నిర్వహించారు.
మున్సిపల్‌కే ఆసక్తి చూపి..
మున్సిపల్‌లో విలీనం అయిన సంబంధిత కార్యదర్శులు ఆ శాఖలోనే విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపించారు. కొన్ని నెలల క్రితం విలీనం అయిన గ్రామ అధికారుల నుంచి పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహిస్తారా? మున్సిపల్ శాఖలో విధులు నిర్వహిస్తారా? అనే అంశంపై సంబంధిత కార్యదర్శుల నుంచి మున్సిపల్ అధికారులు ఆప్షన్లు తీసుకున్నారు. మున్సిపల్‌లో త్వరితగతిన పదోన్నతులు లభించటంతో పాటు అర్బన్ ఏరియాలో పనిచేసే అవకాశం ఉంటుందనే కారణాలతో ఎక్కువగా మున్సిపల్‌లోనే విధులు నిర్వహించేందుకు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కోర్టును ఆశ్రయించి..
మున్సిపాలిటీలలోనే తాము విధులు కొనసాగిస్తామంటూ పలువురు పంచాయతీ కార్యదర్శులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పలు గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనం అయిన తర్వాత ఇప్పటివరకు మున్సిపల్‌లోనే విధులు నిర్వహించారు. అయితే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు రావాలని ఉత్తర్వులు రావడంతో కోర్టుకు వెళ్లారు. మిగతా వారికి త్వరలో పంచాయతీ కార్యదర్శులుగా కేటాయించనున్నారు. ఇక జిల్లాలోని జిన్నారంతోపాటు పటాన్ చెరువు మండలంలోని పలు గ్రామాలను కూడా త్వరలో మున్సిపాలిటీలలో విలీనం అవుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు
కోర్టును ఆశ్రయించిన
పలువురు పంచాయతీ కార్యదర్శులు
త్వరలో మరిన్ని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం