
పేలిన సిలిండర్
● తృటిలో తప్పిన పెను ప్రమాదం
● మహిళకు గాయాలు
నారాయణఖేడ్: ప్రమాదవశాత్తు వంటగ్యాస్ సిలిండర్ పేలి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకరు గాయాలతో బయట పడ్డారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలోని జంబికుంటలో భూలక్ష్మమ్మ జాత ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో అన్ని కుంటుంబాల్లో బంధువుల అలజడి ఉంది. గ్రామానికి చెందిన నీరుడి మోహన్‌కు చెందిన కుటుంబంలో బందువుల రాకతో 25 మంది వరకు ఉన్నారు. ఉదయం బంధువులకు టిఫిన్ చేసేందుకు మోహన్ అత్త నాగమణి వంటగ్యాస్ సిలిండర్‌పై టిఫిన్‌ను తయారు చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగిసి పడ్డాయి. నాగమణి చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబీకులు, బంధువులు వెంటనే స్పందించి ఇంట్లోని నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు చాలాసేపు ఎగిసి పడ్డాయి. కుటుంబీకులు, కాలనీవాసులు నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంటి పైకప్పు, దూలాలు, బట్టలు, విద్యుత్ వైర్లు, బల్బులు పూర్తిగా కాలిపోయాయి. ఇల్లు కాలిపోయి పూర్తిగా దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకొని తహసీల్దార్ నాగజ్యోతి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జాన్సన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.