
గుమ్మడిదల టోల్ ప్లాజా తొలగించండి
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలో టోల్‌ప్లాజా ఏర్పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు, వాహనదారులకు ఆర్థిక భారంగా మారిందని వెంటనే దానిని తొలగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారి మాధవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హైవే నిబంధన ప్రకారం రోడ్డు ప్రారంభం నుంచి ముగింపు మధ్యలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాల్సి ఉండగా రోడ్డు ప్రారంభంలోని గుమ్మడిదలలో ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల, మండలాల ప్రజలకు టోల్ భారం తప్పడం లేదన్నారు. దీంతో జిన్నారం, మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రయాణించే వాహనదారులు టోల్ ప్లాజా ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. గుమ్మడిదల ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అక్కడ టోల్ ప్లాజా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందని వెంటనే టోల్ ప్లాజాను తొలగించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అంజిరెడ్డితోపాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.