
పాలిథిన్.. పాయిజన్!
పర్యావరణానికి ప్లాస్టిక్ కవర్ల ముప్పు
● మృత్యువాత పడుతున్న పశువులు ● పట్టించుకోని అధికారులు
జహీరాబాద్ టౌన్: పాలిథిన్ కవర్లు తిని ఈ నెల 18న ఓ ఆవు మృతి చెందింది. జహీరాబాద్ పట్టణంలో రోడ్లపై సంచరిస్తూ ప్లాస్టిక్ కవర్లు తిని అస్వస్థతకు గురైంది. చికిత్స అందించిన మూడు రోజుల తరువాత చనిపోయింది. పాలిథిన్ కవర్లు తిని పశువులు తరుచూ మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణానికి హాని కల్గించే ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నా ఎక్కడ అమలు కావడం లేదు.
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితమైంది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, టిఫిన్ బండ్లు, మాసం దుకాణాలు ఖాళీ ప్రదేశాలు, మురికి కాలువలు ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు ముంచెత్తుతున్నాయి. కవర్లకు తోడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం పెరగడంతో మురికి కాలువలు, రోడ్ల పక్కన కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో విఫలం
మున్సిపల్ పరిధిలో కవర్ల నిషేధం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వ్యాపారులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. కరపత్రాలను పంచారు. 40మైక్రోన్స్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడరాదని ఆదేశించారు. జ్యూట్ బ్యాగులు, బట్ట బస్తాలు వినియోగించాలని చెప్పారు. తనిఖీలు నిర్వహించి కొంత మందికి జరిమానాలను విధించారు. కొన్ని రోజుల తరువాత యథేచ్ఛగా కవర్లను వినియోగిస్తున్నారు.
175 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి
జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, అందోల్ మున్సిపాలిటీల్లో సుమారు 175 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.అందులో 60 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. పాలిథిన్ కవర్లను వాడటం వల్ల అనేక అనార్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పశువులు వీటిని తినడం వల్ల అనారోగ్య బారిన పడుతూ చనిపోతున్నాయి. పర్యావరణానికి హానికలిగిస్తూ ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయన్నారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలయాలు సమయంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన, మురికి కాలువల్లో కవర్లు పారబోయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ అధికారులు పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్లాగా క్యారీ బ్యాగ్స్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కవర్లు అమ్మినా.,. వాడానా జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు మార్కెట్‌కు వెళ్లినప్పుడు బట్ట సంచులు తీసుకెళ్లాలని సూచించారు.