
వాన కురవక.. సాగు సాగక
అన్నదాతల ఎదురు చూపులు
● ఇప్పటివరకు 42,191 ఎకరాల్లోనే సాగు ● ఎండుతున్న మొలకలు ● జూలై పైనే రైతన్నల ఆశలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో పంటల సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్‌లో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు సంబురపడ్డారు. జూన్‌లో మాత్రం ముఖం చాటేశాయి. అప్పుడప్పుడు కురిసిన చిరు జల్లులకు రైతులు పలు చోట్ల విత్తనాలు విత్తారు. కానీ కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపునకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా వేసిన విత్తనాలు భూమిలో తడి లేకపోవడంతో మొలకెత్తడం లేదు.
ఈ వానాకాలంలో జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 42,191 ఎకరాల్లో మాత్రమే రైతులు విత్తనాలు విత్తారు. 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా 37,609 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. అలాగే వరి 3.75లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేయగా 174 ఎకరాల్లో నాట్లు వేశారు. 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేయగా నేటి వరకు 4253 ఎకరాల్లో విత్తనాలు వేశారు. కందులు–135 ఎకరాలు, పెసర–20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు తొందరపడొద్దని, దుక్కులు దున్ని సిద్ధం చేసుకుని, వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దుబ్బాకకు చెందిన రైతు ఎంకమ్మగారి నారాయణరెడ్డి. వానలు లేక ఇప్పటి వరకు వరినారు పోయలేదు. బోరు బావి పెట్టి నారు పోద్దామంటే వానలు లేవు తూకం పోస్తే దుక్కులు ఎలా పారుతాయి. దున్నడం ఎట్లా అనే పరేషాన్‌లో ఉండు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పెద్ద వానలు కొట్టకపోవడంతో నార్లు పోయలేదు. ఎప్పుడు వానలు పడతాయో తోస్తలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిండు. ఇది ఒక్క రైతు నారాయణరెడ్డి బాధనే కాదు జిల్లాలోని అందరి అన్నదాతల ఆవేదన ఇదే.
డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీరు
జూన్‌లో విత్తిన విత్తనాల ద్వారా మొలకెత్తిన మొలకలను రక్షించుకునేందుకు నీటి సౌకర్యం ఉన్న రైతులు డ్రీప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటకు నీరు అందిస్తున్నారు. దీంతో నీరు లేని రైతులు మాత్రం వరుణుడి రాక కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. చిన్న చిరు జల్లులు పడినప్పటికీ మొలక పెరిగే దశలో వర్షాలు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విధంగా రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు. సకాలంలో విత్తకపోతే పంటకు తెగులు, దిగుబడి తగ్గే అవకాశం లేకపోలేదని రైతులు వాపోతున్నారు.

వాన కురవక.. సాగు సాగక