
అవినీతిపై చర్యలు తీసుకోవాలి
పోలీసులకు ముదిరాజ్ కులస్తుల ఫిర్యాదు
రామాయంపేట(మెదక్): స్థానిక మల్లె చెరువులో పట్టిన చేపల అమ్మకంలో అవినీతికి పాల్పడి సంఘానికి నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వందలాది మంది ముదిరాజ్ కుల సంఘం సభ్యులు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ముదిరాజ్ సంఘంలో సుమారుగా ఎనిమిది వందలకు పైగా సభ్యులున్నారని తెలిపారు. చేపలు అమ్మితే వచ్చే ఆదాయాన్ని సభ్యులందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఇలా కాకుండా కొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఏటా సంఘం తరపున పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, జాతర ఖర్చుల నిమిత్తం మల్లెచెరువులో ఉన్న చేపల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఏకపక్షంగా మల్లె చెరువులో చేపలు పట్టి అమ్ముకున్నారని, తూకంలో సైతం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జాతర ఖర్చుల నిమిత్తం రూ.ఎనిమిది లక్షలు ఖర్చు అవుతాయని, నిరుపేదలైన కుల సంఘం సభ్యులు డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు.