
ఉన్నత చదువులకోసం వెళ్లి..
విగతజీవిగా వచ్చి...
● చాట్లపల్లి విద్యార్థి పంజాబ్‌లో ఆత్మహత్య ● మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు ● సిద్దిపేట జిల్లాలో విషాదం
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఉన్న ఒక కొడుకు ఉన్నత చదువుల కోసం పోయి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. చక్కగా చదువుకో కొడుకా అంటూ సాగనంపిన తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. ఏమైందో ఏమో కానీ అతడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బరిగె భిక్షపతి, కవిత దంపతులు. వీరికి కొడుకు అజయ్(22), కూతురు ఉన్నారు. దంపతులిద్దరు గ్రామంలోనే తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఉన్నత చదువుల కోసం పంజాబ్ రాష్ట్రంలో లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేరాడు. బీటెక్ నాలుగోవ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెలలో స్వగ్రామానికి వచ్చి తిరిగి ఈ నెల 10న కళాశాలకు వెళ్లాడు. తండ్రికి ఫోన్ చేసి కళాశాల ఫీజు కోసం డబ్బులు పంపమని అడుగగా పంపించారు. ఇంతలోనే ఏమైందో ఏమోగానీ ఈ నెల 20న అక్కడే ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జి నిర్వాహకులు తన ఫోన్ ద్వారా స్నేహి తులకు సమాచారం అందించారు. వెంటనే స్నేహితులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. అక్కడి పోలీసులు కేసు నమో దు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు, అక్కడి నుంచి చాట్లపల్లికి తీసుకొచ్చారు.
అయ్యో బిడ్డా..
అయ్యో బిడ్డా మమ్మల్ని ఆగం చేసి పోతివా అంటూ ఆజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చివరి చూపు కోసం తండోపాతండాలుగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.