
గుగ్గిల్లలో భారీ చోరీ
రూ.4.10లక్షలు, వెండి ఆభరణాలు అపహరణ
బెజ్జంకి(సిద్దిపేట): ఓ ఇంట్లో నగదుతో పాటు వెండి ఆభరణాలను గుర్తు తెలియని దండగులు అపహరించారు. ఈ ఘటన మండలంలోని గుగ్గిల్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ శంకర్‌రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కేడిక కృష్ణారెడ్డి, భార్య రమ వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఇంటి ఆరు బయట పడుకున్నారు. ఇంట్లో టీవీ బంద్ చేయడానికి అర్ధరాత్రి కృష్ణారెడ్డి వెళ్లి తిరిగి వస్తుండగా ఇంటి వెనుక గల దర్వాజ తెరిచి ఉంది. అనుమానంతో వెంటనే పక్క గదిలో వున్న బీరువాను పరిశీలించగా తాళం తీసి వుంది. ఫైనాన్స్‌లో కట్టేందుకు అప్పుగా తెచ్చి బీరువాలో పెట్టిన రూ.4.10 లక్షలు, బంగారు వెండి ఆభరణాలతో పాటు మరో బ్యాగులోని 10వేల నగదును దుండగులు అపహరించారు. దొంగలు పడ్డారని అరువడంతో స్థానికులు వీధిలోకి వచ్చారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల యువకులిద్దరు ఆయిల్ పూసుకుని కత్తులు పట్టుకుని వెళ్లడం చూశామని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఏఎస్‌ఐ శంకర్‌రావు పరిశీలించారు. చోరీ ఘటనలో 4.65 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించేందుకు రెండు టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశామని పేర్కొన్నారు.