
వీడని మహిళ హత్య మిస్టరీ
నిందితుల అరెస్టులో జాప్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): గత నెలలో మండలాన్ని కుదిపేసిన కమ్మర్లపల్లి మహిళా హత్య మిస్టరీ ప్రశ్నార్థకంగా మారింది. మహిళను పట్టపగలే ఆమె నివాసంలో హత్య చేసిన నిందితుల జాడ కనుక్కోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ పేరిట గ్రామంలోని పలువురిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలివేయడం లాంటి ఘటనల నేపథ్యంలో గ్రామ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్నా హత్య మిస్టరీ వీడకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన గాలి బాలలక్ష్మి(50) ఇంట్లో కిరాణా షాపు నడుపుతుండగా, భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. గత నెల 30న మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న బాలలక్ష్మిని కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంగారు, ఆభరణాల కోసమే గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. హత్య జరిగి 22 రోజులు అవుతున్నా నిందితులను గుర్తించలేదు. దీంతో కమ్మర్లపల్లిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణను అడగగా.. విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.