
బిడ్డకు జన్మనిచ్చి... కన్ను మూసిన తల్లి
అల్వాలలో విషాదం
మిరుదొడ్డి(దుబ్బాక): పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తీవ్ర అస్వస్థతకు గురై కన్ను మూసింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని అల్వాల లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మంగళి లింగం, వాణి దంపతులు. లింగం గ్రామంలో సెలూన్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాణి (32) ఐకేపీలో సీఏగా పని చేస్తుంది. కాగా ఆమె గర్భిణి కావడంతో ఇటీవల సిద్దిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి ప్రసవ సమయంలో తల్లీ బిడ్డలకు ప్రాణాపాయం ఉందని తేల్చి చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు సైతం తల్లి, బిడ్డలకు ప్రమాదమని చెప్పా రు. ఈ నేపథ్యంలో వాణికి పురిటి నొప్పులు రాగా ఆపరేషన్ చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు బ్లీడింగ్ ఎక్కువడంతో పాటు నోటి వెంట రక్తం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యులు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె శుక్రవారం కన్ను మూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు.