
విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
నంగునూరు(సిద్దిపేట): నంగునూరులో వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నాయకులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. హిందూ సంఘాలు, అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం నంగునూరులో ర్యాలీ నిర్వహించి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు స్థానికంగా నివాసం ఉంటున్నారని, వారి ఆధార్ కార్డులను పరిశీలించాలని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ... కొన్నేళ్ల కింద గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్న సమయంలో గొడవలు జరిగాయన్నారు. సమస్య సమసిపోయి అందరి ఆమోదంతో తహసీల్దార్ కార్యాలయం సర్కిల్‌లో విగ్రహాన్ని నెలకొల్పామని తెలిపారు. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నామని, కొందరు గొడవలు సృష్టించేందుకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ అసీఫ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని సీఐ తెలిపారు.
హిందూ సంఘాలు,
అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా