
అసంపూర్తిగా త్రిశూలం, ఢమరుకం పనులు
● మల్లన్న ఆలయం వద్ద ఏర్పాటు ● రూ.63 లక్షల వ్యయంతో నిర్మాణం ప్రారంభం ● డిజైన్ మార్పుతో పెరిగిన వ్యయం ● మరో రూ.20 లక్షలకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని భక్తులు పరమశివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ఆలయ గొప్పతనాన్ని చాటడంతోపాటు శివుడి ప్రతి రూపం ప్రతిబింబించేలా మల్లన్న ఆలయంపై ఉన్న ఎల్లమ్మ గుట్టపై త్రిశూలం, ఢమరుకం ఏర్పాటుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నా పనులు పూర్తి చేయడానికి నిధులు కొరత వెంటాడుతుంది. గతేడాది స్వామి వారి కల్యాణానికి ముందే పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ అధికారులు ప్రకటించి పనులు వేగంగా చేసినా నిధులు సరిపోక అసంపూర్తిగా వదిలేశారు. రూ.63 లక్షల వ్యయంతో 2023 సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించారు. పనులు చివరి దశకు చేరుకోగా హైదరబాద్‌లోని ఓ కార్ఖానాలో స్టీల్‌తో త్రిశూలం, ఢమరుకం, ఓం ఆకారాలను తయారు చేయించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేందుకు వీలుగా ఆకారాలను బిగేంచేందుకు రెండు అంతస్థుల భవనం నిర్మించారు. కానీ డిజైనింగ్‌లో మార్పు వల్ల ప్రతిపాదించిన రూ.63 లక్షల వ్యయం సరిపోలేదని అదనంగా రూ.20 లక్షలు అవసరమవుతాయని నిధులు మంజూరు చేస్తే పనులు చేస్తామని నవంబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంత వరకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగలి అన్న చందంగా మారాయి. కమిషనర్ అనుమతి కోసం ఫైల్ పంపించామని, అనుమతి రాగానే పనులు పూర్తి చేస్తామని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు.