
వేర్వేరు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
మెదక్ జిల్లాలో బుధవారం జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కారు, డీసీఎం ఢీకొనడంతో ఎనిమిది మంది
శివ్వంపేట(నర్సాపూర్) : కారును డీసీఎం ఢీకొట్టడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తూప్రాన్–నర్సాపూర్ హైవేపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలం మున్‌రాయి గ్రామానికి చెందిన ముచ్చర్ల రమేశ్ కుటుంబ సభ్యులు శివ్వంపేట మండలం గోమారంలో మంగళవారం రాత్రి జరిగిన శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు స్వగ్రామానికి కారులో బయలుదేరారు. చిన్నగొట్టిముక్ల గ్రామ శివారులో శభాష్‌పల్లిలోని సుగుణ పరిశ్రమ నుంచి పరంలోడుతో నర్సాపూర్ వైపునకు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి వీరి కారుని ఢీకొట్టింది. దీంతో కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడటంతో 8 మందికి గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేట వద్ద ఐదుగురు
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ శివారులో బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు గాయపడ్డారు. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్డీసీ బస్సు రామాయంపేట వస్తుండగా కోమటిపల్లి స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావడంతో బస్సు డ్రైవర్ స్లో చేశాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా తిప్పాపూర్‌కు చెందిన ప్రమీల స్పల్పంగా గాయపడింది. మరో ఘటనలో దౌల్తాబాద్ వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కారును బొలేరో ఢీకొట్టడంతో ఐదుగురు
తూప్రాన్: కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తూప్రాన్–గజ్వేల్ రహదారిపై మండలంలోని యావపూర్ చౌరస్తా సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. పట్టణంలోని హైదర్‌గూడకు చెందిన పరశపోగు రమేశ్ కారులో నలుగురు మేసీ్త్రలను సిద్దిపేట జిల్లా అనంతగిరిపల్లెకు తీసుకెళ్తున్నాడు. యావపూర్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం కారును, మరో ద్విచక్ర వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రవీణ్, శివ, సురేశ్, మరియదాస్‌తోపాటు బైక్‌పై ఉన్న శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దంపతులకు తీవ్ర గాయాలు
నర్సాపూర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం నర్సాపూర్–తూప్రాన్ రహదారిలోని కోమటికుంట సమీపంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమంతపూర్‌కు చెందిన అరట్ల వినయ్, భార్య రజిత కలిసి బైక్ పై నర్సాపూర్ వైపు వస్తున్నారు. ప్రమాదవశాత్తు కారుతోపాటు లారీని ఢీకొట్టారు. దంపతులిద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నర్సాపూర్ ఎస్సై లింగంను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.