
కవి, చిత్రకారుడు ప్రవీణ్ కన్నుమూత
– మెడికల్ కళాశాలకు పార్ధివదేహం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారు డు, కళాకారుడు, కవి చొప్పదండి ప్రవీణ్ (పెంటన్న) (72) మంగళవారం కన్ను మూశారు. ఈయన కాకతీయ యూనివర్సిటీలో తెలుగు ఉపన్యాసకులుగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. సిద్దిపేట ప్రేరణ సాహితీ సంస్థ, నవ్య కళానికేతన్‌కు సేవలు అందించారు. ప్రముఖ రచయిత శారద కథలపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు పెంటన్న పార్ధిదేహాన్ని సిద్దిపేట మెడికల్ కళాశాలకు పరిశోధనల కోసం అందజేశారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిదారెడ్డి, కవులు కొమురవెల్లి అంజయ్య, పప్పుల రాజిరెడ్డి, వేముగంటి మురళీ, తైదల అంజయ్య, భగవాన్ రెడ్డి , మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, తెలంగాణ రచయితల సంఘం, మరసం ప్రతినిధులు, తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి ముండ్రాయి శివారులో చోటు చేసుకుంది. రాజగోపాల్‌పేట గ్రామానికి చెందిన కొక్కోండ జగదీశ్ చారి (23) సిద్దిపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులు ముగించుకొని స్వగామానికి తిరిగి వస్తున్నాడు. సురభి ఆస్పత్రి సమీపంలో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జగదీశ్‌ది ఎర్రవల్లి కాగా మల్లన్నసాగర్ నిర్మాణంలో ఇల్లు కోల్పోవడంతో అమ్మమ్మ గ్రామం రాజగోపాల్‌పేటలో నివాసం ఉంటున్నాడు. కాగా అతని తండ్రి గతంలోనే మరణించగా తల్లి బాగ్యవ్వ, తమ్ముడు మధు ఉన్నారు.

కవి, చిత్రకారుడు ప్రవీణ్ కన్నుమూత