ఫల రాజ కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ఫల రాజ కేంద్రం

May 22 2025 7:36 AM | Updated on May 22 2025 7:36 AM

ఫల రా

ఫల రాజ కేంద్రం

ఉద్యానానికి ఊతం..
● రైతులకు ఉపయోగపడేలా నర్సరీలు ● వృద్ధి చెందుతున్న ములుగు‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ● 53 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● మొక్కలతోపాటు శిక్షణ తరగతులు ● ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి

ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రైతన్నలకు ఆదాయం సమకూరేలా పండ్ల తోటలు సాగు చేసేలా ప్రోత్సహిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో సాగుకు అనువైన వివిధ రకాల ఉద్యాన మొక్కలను వృద్ధి పరిచి, పంపిణీ చేయడం, ప్రత్యక్ష పద్ధతిలో శిక్షణ, రైతుల ఆదాయ వనరులు పెంపొందింపజేయడం లక్ష్యంగా ప్రభుత్వం ములుగు మండల కేంద్రంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ఫ్రూట్స్‌’ ఫల పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాల పండ్ల మొక్కలు, రైతులు ఆసక్తి చూపే ఉద్యాన పండ్ల మొక్కలు, ఎకో ప్లాంటేషన్‌ మొక్కలను ఇక్కడ నర్సరీల్లో అభివృద్ధి చేసి రైతులకు అందజేస్తారు.

– ములుగు(గజ్వేల్‌)

ములుగు మండల కేంద్రం సమీపంలో రాజీవ్‌ రహదారి ఆనుకొని 53 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కల పరిశోధన, అభివృద్ధి కోసం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో కేవలం మొక్కలు అభివృద్ధి చేసి రైతులకు సకాలంలో పంపిణీ చేయడానికే పరిమితం కాదు. వాటి సాగు విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించేలా కేంద్రంలో ప్రత్యక్ష శిక్షణ కూడా ఇస్తారు. రైతుల చేతుల మీదుగా ఆయా పద్ధతులు ఆచరింపజేస్తూ వివరిస్తారు. మామిడి మొక్క కొమ్మ ఎలా కత్తిరించాలి.. ఏ సీజన్‌లో కత్తిరింపు జేయాలి.. తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను సలహాలతో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ప్రాక్టికల్‌గా చూపిస్తారు. దీంతో ఉద్యాన తోటలపై రైతులకు సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. పక్కనే ఉద్యాన యూనివర్సిటీ ఉండటంతో ఇక్కడ రైతులతోపాటు ఉద్యాన విద్యార్థులకు సైతం శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. సైంటిస్టులు అందుబాటులో ఉండటం వల్ల శాస్త్రవేత్తల ద్వారా మరింత మెరుగైన శిక్షణ లభిస్తుంది.

ప్రత్యక్షంగా ప్రదర్శన క్షేత్రాలు

ఉద్యాన రైతులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా 53 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. అందులో డ్రిప్‌ ఇరిగేషన్‌, మల్చింగ్‌, ఫర్టిగేషన్‌ తదితర విధానాలు ఆచరిస్తున్నారు. ఆ విధంగా వృద్ధి చేసిన డెమో ప్లాట్లలో కొమ్మల కత్తిరింపు, ఎరువుల వాడకం, సస్యరక్షణ తదితర అంశాలను ప్రత్యక్ష పద్ధతిలో చూపుతూ రైతుల్లో అవగాహన పెంపొందింపజేసేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

పరిశోధన కేంద్రంలో ఎన్నెన్నో రకాలు

ములుగు ఫల పరిశోధన అభివృద్ధి కేంద్రం–సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో తెలంగాణ ప్రాంతానికి అనువైన ఉద్యాన పండ్ల మొక్కల రకాల అభివృద్ధి జరుగుతుంది. ఇందులో 17 రకాల మామిడి, 3 రకాల నిమ్మ, 5 రకాల జామ, 5 రకాల దానిమ్మ, 3 రకాల డ్రాగన్‌ ఫ్రూట్‌, 4 రకాల చింత, ఒక రకం ీసీతాఫలం, 2 రకాల వెదురు, 9 రకాల ఆయిల్‌ పామ్‌ తదితర వైరెటీలు ఇక్కడి డెమో ప్లాట్లలో సాగు చేశారు. అంతే కాకుండా శ్రీగంధం, కూరగాయలు, వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు.

రాయితీలు అనుసంధానంగా..

రైతులు ఎన్ని ఎకరాల్లో.. ఏ రకం ఉద్యాన పండ్ల మొక్కలు సాగు చేయాలనుకుంటున్నారో ముందుగా కేంద్రంలో నమోదు చేయించాలి. అందుకు అనుగుణంగా ఆయా మొక్కలను నర్సరీలో వృద్ధి చేసి సకాలంలో రైతులకు అందజేస్తారు. అయితే నర్సరీ ద్వారా మొక్కలు తీసుకున్న రైతులు రాయితీని మాత్రం వివిధ ఉద్యాన పథకాల ద్వారా పొందాల్సి ఉంటుంది.

పరిశోధనల నిలయం

తెలంగాణ ప్రాంత భూములకు అనువైన పండ్ల రకాలపై ములుగు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ పరిశోధన జరుపుతుంది. మార్కెట్‌ డిమాండ్‌కు అనువైన రకాలు ఏమిటి, అధిక దిగుబడి రకాలు ఏమిటి తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని మొక్కల వృద్ధి కోసం పరిశోధనలు జరుపుతారు. డిమాండ్‌కు అనువైన పండ్ల రకాలను, ఇతర రాష్ట్రాల వైరెటీలు సైతం ఇక్కడ అభివృద్ధి చేస్తారు. దీంతో రైతులు పండ్ల వైరెటీల కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన బాధ ఉండదు. ఓ సూపర్‌ బజార్‌ మాదిరి అన్ని ఇక్కడే లభ్యమవుతాయి.

దరఖాస్తు చేసుకుంటే మొక్కలు సిద్ధం చేస్తాం

తెలంగాణ ప్రాంత ఉద్యాన రైతులకు ఊతంగా రాష్ట్రంలోనే ఏర్పాటైన తొలి కేంద్రమిది. ఇక్కడ తెలంగాణకు అనువైన వివిధ రకాల ఉద్యాన పండ్ల మొక్కలు, శ్రీగంధం తదితర అటవీ అభివృద్ధికి దోహదపడే రకాల పరిశోధన, వాటిని రైతులకు అందజేసేందుకు నర్సరీల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రైతులు దరఖాస్తు చేసుకుంటే ఆ సీజన్‌ వరకు మొక్కలు సిద్ధం చేస్తాం. ఆ తర్వాత మొక్కలను కేంద్రం నుంచి తీసుకెళ్లవచ్చు. రైతులు ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి సహకారం కోసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 89777 14250 లేదా ఉద్యానశాఖ అధికారి 90001 36490 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

– బీ.శ్రీధర్‌, ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, ఫ్రూట్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

ఫల రాజ కేంద్రం1
1/4

ఫల రాజ కేంద్రం

ఫల రాజ కేంద్రం2
2/4

ఫల రాజ కేంద్రం

ఫల రాజ కేంద్రం3
3/4

ఫల రాజ కేంద్రం

ఫల రాజ కేంద్రం4
4/4

ఫల రాజ కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement