
ఆన్‌లైన్ మోసాలపై అవగాహన
ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశం
సంగారెడ్డి జోన్: ఆన్‌లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్‌పై జిల్లా ప్రజలలకు, విద్యాసంస్థలలో అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శనివారం జిల్లా తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు పేరుతో ఆన్‌లైన్‌లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరని స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్టులు ఉండవు, ఫిజికల్ అరెస్టు మాత్రమే ఉంటుందన్నారు. వాణిజ్య పరంగా 20 కిలోల బరువు కలిగిన గంజాయిని అక్రమ రవాణా చేసిన స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్‌మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.