
ఐటీ కంపెనీల్లో మారుతున్న టీం లీడర్ అర్థం
పోస్ట్‌మన్ పని ఇక ఏమాత్రం కుదరదంటున్న సంస్థలు
కొత్తగా నేర్చుకోవాలి.. కింది ఉద్యోగులకు నేర్పించాలి
చెప్పింది మాత్రమే చేసే ఉద్యోగులకు ఉద్వాసనే
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సమూల మార్పులు
లింక్డ్ ఇన్, నౌకరీ డాట్‌కామ్ సంస్థల సర్వేల్లో వెల్లడి
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగప్రవేశంతో సాఫ్ట్‌వేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పింది చేసేవారు కాకుండా, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలున్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది. ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య పోస్టుమన్ ఉద్యోగం చేయడమే లీడర్ షిప్ కాదని టెక్ రంగం స్పష్టం చేస్తోంది.
ముందు తను నేర్చుకోవాలి.. ఆ తర్వాత టీంలోని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని సంస్థలు అంటున్నాయి. ప్రముఖ ఉద్యోగ ప్లాట్‌ఫామ్స్ లింక్డ్ ఇన్, నౌకరీ డాట్‌కామ్ ఐటీ ఉద్యోగంలో వస్తున్న మార్పులను విశ్లేషించాయి. ఇప్పటివరకు ఐటీ సెక్టార్‌లో సర్వీస్ ప్రాధాన్యంగానే ఉద్యోగాల సృష్టి జరిగింది. దేశంలో ప్రతి లక్ష మంది ఉద్యోగుల్లో 80 వేల మంది ఈ కేటగిరీలోనే ఇంతకాలం పనిచేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
కొత్తగా ఆలోచించాల్సిందే..
ప్రధాన టెక్ సంస్థలన్నీ ఏఐతో కూడిన డేటాను సిద్ధం చేసుకున్నాయి. దీంతో నాయకత్వ పని చాలావరకు ఏఐ చేస్తోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్టు స్కిల్ ఇండియా పేర్కొంది. ప్రపంచంలో మొత్తం 67,200 కృత్రిమ మేధ సంస్థలుండగా, అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్‌లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే, వాటిల్లో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి.
ఇవి ఈ రంగంపై రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్‌టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో ఇండియాలో 2,100 ఫిన్‌టెక్ కంపెనీలుంటే ఇప్పుడు 10,200కు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాధారణ పని విధానం ఐటీ ఉద్యోగాలకు పనికిరాదని పిన్‌టెక్ సంస్థలు అంటున్నాయి. ఏఐతో పనిచేసే టీం లీడర్ క్రియేటివ్ ఆలోచనా విధానం... దానికి తగ్గట్టుగా లాంగ్వేజ్ మాడ్యూల్స్ అభివృద్ధి చేసుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల రిక్రూట్ విభాగాలు పేర్కొంటున్నాయి.
చెప్పింది మాత్రమే చేస్తే.. ఉద్యోగం ఊస్టే
ఇప్పుడున్న టెక్నాలజీ సిస్టమ్‌లో సర్విస్ సెక్టార్ కోడ్‌ను ఏఐ డీకోడ్ చేసే ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఈ పని ఐటీ ఉద్యోగుల ద్వారా జరిగేది. దీంతో గతం మాదిరిగా అనుకరించే పనికే పరిమితమైన ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఏఐకి ప్రోగ్రామింగ్ ఇవ్వగల నేర్పు, అది కూడా ఏఐ డేటాలో ఉన్నది కాకుండా కొత్తదిగా ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయి. సరికొత్త కోడింగ్ వ్యవస్థను తీసుకొచ్చే ఉద్యోగుల కోసం వెదుకుతున్నాయి.
స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం ఇలాంటి నిపుణులు 2026 నాటికి 10 లక్షల మంది అవసరం ఉంది. నౌకరీ డాట్‌కామ్ అభిప్రాయ సేకరణలో దాదాపు 152 సంస్థలు ఇదే విషయాన్ని చెప్పాయి. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ కోడింగ్ నిపుణులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కావల్సింది 6.29 లక్షల మంది. ఏఐ డేటా అనాలసిస్ వచ్చిన తర్వాత దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోవటమో, కోల్పోయే పరిస్థితికి చేరడమో జరిగిందని ఐటీ కంపెనీలు అంటున్నాయి.
నిత్యం అప్‌గ్రేడ్ అవ్వాలి
ఐటీ సెక్టార్‌లో టీం లీడర్ రోల్ పూర్తిగా మారిపోయింది. ఉద్యోగి పని విధానం అంచనా వేయడానికి సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీంతోపాటే టీం లీడర్ పరిధిలో పనిచేసే వారిని స్కిల్ వైపు ఏ విధంగా తిప్పగలిగామో కంపెనీ అంచనా వేస్తోంది. తప్పులను కిందివాళ్లపై నెట్టడం ఇక కుదరని పని. కింది ఉద్యోగి పని విధానం మెరుగవ్వలేదంటే టీం లీడర్‌ను కంపెనీలు బాధ్యులను చేస్తున్నాయి. నేర్చుకోవడం, నేర్పించడం వంటి నాయకత్వ లక్షణాలున్న టీం లీడర్‌ను కంపెనీలు కోరుకుంటున్నాయి. – వికాశ్ వాసన్, ఎంఎన్‌సీ కంపెనీలో డేటా టీం లీడర్
నాయకత్వ సృజనాత్మకత కావాలి
ఇంటర్వ్యూ చేసేప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీని కంపెనీలు పరిశీలిస్తున్నాయి. చాలా మంది ఇక్కడే తిరస్కరణకు గురవుతున్నారు. చాలామందిలో ఏఐ మాడ్యూల్స్‌ను ఇతర ఉద్యోగులతో కలిసి లేదా ఇతర కంపెనీలతో కలిసి నిర్వహించగల సామర్థ్యం కన్పించడం లేదు. వేగంగా మారుతున్న డేటా విధానం వల్ల శరవేగంగా అందరితో సమన్వయం చేసుకునే నాయకత్వ లక్షణం ఇప్పుడు టెక్ రంగంలో ఎంతో అవసరం. – సంజీవ్ పల్లవ్, ఐటీ ఆధారిత కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్