
గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌కి ఇక వీడ్కోలు
ఎలా పిలిచినా పలికే గూగుల్ జెమినీకి స్వాగతం
ఆండ్రాయిడ్‌తో సంయుక్తంగా అందుబాటులోకి
స్మార్ట్‌ఫోన్స్ లు దాటి వాచ్‌లు, కార్లు, టీవీల్లోకి ప్రవేశం
భవిష్యత్తులో అబ్బురపరిచే జెమినీ కళ్లజోళ్లు
ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా ఒకప్పుడు మనం టెక్ట్స్ / క్లిక్ ద్వారా కమాండ్ ఇవ్వకుంటే ఉలుకూ, పలుకూ లేకుండా పడి ఉండేవి. కానీ, గ్యాడ్జెట్‌లు మన చుట్టూనే చేరి గుట్టుగా పని చేసుకుపోతున్నాయి. మనం సైగ చేస్తే చాలు.. కమాండ్‌ని స్వీకరిస్తున్నాయి. చూస్తే చాలు.. అలర్ట్ అవుతున్నాయి. పిలిస్తే పలుకుతున్నాయి. ఇదంతా ఎలా కృత్రిమ మేధ (ఏఐ) మాయ.
అందుకే అన్ని దిగ్గజ సంస్థలు ఏఐ అసిస్టెంట్‌లను ఆశ్రయిస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది గూగుల్ గూట్లో నుంచి పుట్టిన జెమినీ. వాయిస్ అసిస్టెంట్‌తో ఎప్పటి నుంచో పిలిస్తే పలికే సేవలను అందించిన గూగుల్ ఇప్పుడు అన్నింటికీ ‘జెమినీ.. జెమినీ’ అనేలా అప్‌డేట్ అవుతోంది. స్మార్ట్‌ఫోన్స్ ని దాటేసి.. ఇప్పుడు అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లోకి జెమినీ సేవలను లాంచ్ చేస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఆండ్రాయిడ్‌తో జట్టుకట్టి ముందుకొస్తున్న జెమినీ ఏఐతో ఇక గూగుల్ యూజర్లకు పండుగే. వాచ్‌లు మీ పల్స్, హార్ట్ బీట్స్ వినడమే కాదు.. మీ మనసెరిగి పని చేస్తాయి. కార్లు మీ జర్నీ ముచ్చట్లను వింటూ మరింత ఆహ్లాదకరమైన ఇన్స్ పుట్స్‌ను ఇస్తాయి. ఇందుకు కారణం.. స్మార్ట్ వాచ్‌లు మొదలుకొని కారు, టీవీ, హెడ్‌సెట్, కళ్లజోళ్లు.. ఇలా అన్నింటిలోనూ గూగుల్ కంపెనీ ‘జెమినీ ఏఐ’ని ప్రవేశపెట్టడమే.
మణికట్టుపై మాయాజాలం!
అరచేతిలో ఫోనే కాదు... మణికట్టుపై స్మార్ట్ వాచ్‌లు కూడా చాలానే చేస్తున్నాయి. వర్కవుట్ చేస్తున్నప్పుడు లేదా వంట చేస్తున్నప్పుడు.. మీ చేతిలో ఫోన్ ఉండకపోయినా.. చేతికి వాచ్ ఉంటే చాలు. పనులను చక్కబెట్టేయొచ్చు. ఎందుకంటే.. ఇకపై ఇలాంటి వాచ్‌లపై జెమినీ ఏఐ పని చేస్తుంది. మీరు మీ వాచ్‌తో మాట్లాడొచ్చు. కమాండ్స్ ఇవ్వొచ్చు. మీరు ఏదైనా జిమ్‌లో పర్సనల్ లాకర్ వాడుతుంటే దాని నంబర్‌ను గుర్తుపెట్టుకోమని వాచ్‌కి చెప్పొచ్చు. ఫ్రెండ్ పంపిన ఏదైనా మెయిల్ గురించి అడిగితే వెంటనే వెతికి తెస్తుంది. చిన్న స్క్రీన్ మీద టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడితే చాలు.. టైపింగ్ అయిపోతుంది.
డ్రైవింగ్‌లో తోడుగా..
హై ఎండ్ కార్లలో ఎప్పటి నుంచో నిక్షిప్తమై ఉన్న ఆండ్రాయిడ్ ఆటో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంట్లో ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్‌కి బదులు జెమినీ ఏఐ వస్తోంది. సాధారణంగా మాటలతోనే మీ అవసరాన్ని జెమినీ అర్థం చేసుకుంటుంది. మీ మాటలను వింటూనే మార్గమధ్యంలో ఉన్న పెట్రోల్ బంక్‌ల గురించి చెబుతుంది. అంతేకాదు.. మీరేదైనా ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే అందుకు బెస్ట్ రేటింగ్స్‌తో ఉన్న హోటల్స్‌ను సూచిస్తుంది.
అంతేకాదు.. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఏవైనా బల్క్ మెసేజ్‌లు వస్తే.. అన్నింటినీ సమ్మరైజ్ చేసి సంక్షిప్తంగా సమాచారంగా చెబుతుంది. మీరేదైనా వాక్యాలను చెప్తే వాటిని కావాల్సిన భాషలోకి అనువదించి వినిపిస్తుంది. వెళ్లే దారిలో అందుబాటులో ఉన్న పార్కింగ్ వివరాలను చెబుతుంది. వెళ్లే రూట్ మ్యాప్ సెట్ చేసి పెడితే చాలు.. ఎక్కడెక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి.. రోడ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా.. ఇవన్నీ రియల్ టైమ్‌లోనే అలర్ట్ చేస్తూ చూపిస్తుంది.
టీవీలోనూ ‘జెమినీ’ జోష్
ఓటీటీలు, వివిధ రకాల కంటెంట్ యాప్‌లు ఇంట్లోని టీవీని.. ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్‌టైన్స్ మెంట్ అడ్డాగా మార్చేశాయి. అందుకే ఎప్పటి నుంచో గూగుల్ చూపు స్మార్ట్ టీవీలపై పడింది. ఇకపై గూగుల్ టీవీల్లో కూడా జెమినీ సపోర్ట్ రానుంది. దీంతో టీవీలను రిమోట్‌తోనే కాదు.. మాట్లాడుతూ కంటెంట్‌ను సెలెక్ట్ చేయొచ్చు. మీ పిల్లలకు సరిపోయే కంటెంట్‌ను సెట్ చేసి ఏఐకి చెప్తే చాలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతుంది.
వారెలాంటి హద్దులు దాటకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతుంది. ఒకవేళ పెట్టిన లిమిట్స్ క్రాస్ చేస్తే వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. హాలిడేస్‌లో ఇంట్లో టీవీని పిల్లలకు ట్యూటర్‌గా మార్చేయొచ్చు. జెమినీకి పిల్లలకు సంబంధించిన క్లాస్, సిలబస్ వంటి వివరాలను అందిస్తే చాలు.. ఎడ్యుకేషన్ కంటెంట్‌ను జెమినీ రికమెండ్ చేసి ఇస్తుంది. పిల్లలు అడిగే ప్రశ్నలకు జెమినీ సమాధానం కూడా చెబుతుంది. ఇంకా గూగుల్ వీడియో భాండాగారం యూట్యూబ్ నుంచి కూడా కంటెంట్‌ను సేకరించి చూపిస్తుంది.
హెడ్‌సెట్స్‌లోనూ నిక్షిప్తం
ఏవైనా పర్సనల్‌గా వినాలనుకుంటే.. హెడ్‌సెట్ కోసం వెతికే వాళ్లం. వాటిని ఎక్కువసేపు చెవులకు పెట్టుకోవాలన్నా ఇబ్బందే. ఇప్పుడు హెడ్‌సెట్స్ చెవులకు తగిలించుకునే బడ్స్‌గా మారిపోయాయి. జెమినీ ఏఐ రాకతో వీటి తీరు ఇంకా మారిపోయింది. సోనీ, శామ్‌సంగ్‌తో కలిసి గూగుల్ జెమినీ ఏఐతో నెక్ట్స్ జనరేషన్ ఇయర్ బడ్స్‌ను సిద్ధం చేస్తోంది. కాగా, ‘ఏఐ పవర్డ్ ఆపరేటింగ్ సిస్టం’తో ఎక్స్‌ఆర్ హెడ్‌సెట్‌లను నెక్స్›్టలెవల్‌కి తీసుకెళ్తున్నాయి.
ఉదాహరణకు మీరేదైనా కొత్త టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. ఆ ప్రాంతాన్ని ముందే ఎక్స్‌టెండెడ్ రియాలిటీలో చూసేయొచ్చు. రూట్ మ్యాప్స్, కేఫ్‌లు, స్థానిక ప్రాంతాలను చూస్తూ ఓ అవగాహనకు రావచ్చు. అంటే.. ఇక గూగుల్ మ్యాప్స్ పాత తరం ట్రెండ్‌గా మారిపోతాయి అన్నమాట. సో.. మీరు వింటున్నా, చూస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా లేదా చేతులు ఖాళీగా లేకున్నా – జెమినీ ఎప్పుడూ మీకు ఉపయోగపడే మిత్రుడిగా మారబోతోంది. అంతేకాదు, భవిష్యత్తులో మన అవసరాన్ని ముందుగానే అర్థం చేసుకునే సహాయకుడు కూడా.
కళ్లజోళ్ల మాయాజాలం
దృష్టి సమస్యలు వస్తేనే కళ్లజోడు పెట్టుకుంటాం. లేదంటే.. కాసేపు స్టైల్ కొట్టేందుకు వాడుతుంటాం. కానీ, భవిష్యత్తులో అలా కాదు. మీకు ఏ సమస్యా లేకపోయినా మీరు బయటికి వెళ్తే తప్పనిసరిగా కళ్లజోడు ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే.. కళ్లజోళ్లు స్మార్ట్ అవుతున్నాయి. ఏఐ సపోర్ట్‌తో మల్టీటాస్కింగ్ చేస్తున్నాయి. అందుకే గూగుల్ కూడా తన జెమినీ ఏఐతో స్మార్ట్ గ్లాసెస్‌ను అందించేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ కంపెనీలతో స్టైలిష్ లుక్‌తో వీటిని తీర్చిదిద్దుతోంది. భవిష్యత్తులో ఈ కళ్లజోడును ధరించాక స్మార్ట్‌గా పనులను చక్కబెట్టొచ్చు. చూస్తున్న ప్రతి అంశాన్ని రికార్డు చేయొచ్చు. వాటి వివరాలను సేకరించొచ్చు. వాటిని వెంటనే మెసేజ్ రూపంలో పంపొచ్చు.
ఆయా వివరాల గురించి ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే కళ్లజోడుకు చెప్తే చాలు. కాల్ కలిపేస్తుంది. ఎలాంటి ఇయర్‌ఫోన్స్ ్స లేదా బడ్స్ లేకుండా గ్లాసెస్ నుంచే ఫోన్ మాట్లాడొచ్చు. అంతేకాదు.. మీరేదైనా డేటాను చూస్తే.. దాన్ని మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో మార్చేసుకోవచ్చు. మీరేం మాట్లాడకపోయినా గ్లాసెస్ చూసే ప్రతి విజువల్, ఆడియోను నిత్యం విశ్లేషిస్తూ డేటాను రికార్డు చేస్తుంది. మీరెప్పుడైనా సంబంధిత సమాచారాన్ని కోరితే వెంటనే యాక్సెస్ చేసి చెబుతుంది. బోర్ అనిపిస్తే కళ్లజోడే హెడ్‌సెట్‌లా మారిపోతుంది.