
500కు పైగా పక్షి జాతులకు పొంచి ఉన్న ప్రమాదం
వచ్చే వందేళ్లలో మరెన్నో కనుమరుగు
కఠోర వాస్తవాలను వెల్లడించిన అధ్యయనం
ఆచార వ్యవహారాలు, సంస్కృతికి పట్టు గొమ్మ ల్లాంటి పల్లెటూర్లలో ఉదయం వెచ్చటి సూర్య కిరణ కాంతులు ఎంతటి హాయి గొల్పుతాయో అక్కడి పక్షుల కిలకిలారావాలు అంతకంటే ఎక్కువగా మనల్ని మైమరపింపజేస్తాయి. ఎలాంటి బాదరబందీలేకుండా స్వేచ్ఛగా విహరించే అలాంటి పక్షిజాతులకు ఇప్పుడు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత తదితరాలతో భూగోళం మండిపోతోంది. భూతాపోన్నతి ఏటికేడు పైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు.
ఈ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఇప్పుడు పక్షులపై పడ్డాయి. అన్నెంపున్నెం ఎరుగని పక్షులను వాతావరణమార్పుల మాటున పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న కఠోర వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. వాతావరణ మార్పుల కారణంగా 500కుపైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే ప్రమాదపుటంచునకు చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ఇంగ్లండ్‌లోని బెర్క్‌షైర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అడవుల నరికివేత కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోతున్న వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు.
మూడు రెట్లు పెరిగిన ముప్పు
గతంలోనూ వ్యాధులు ప్రబలడం, సహజావరణంలో ఆహారం, అస్తిత్వం కోసం పోటీ, కొత్త ప్రాంతాలకు వలసలు.. ఇలా పలు కారణాల కారణంగా కొన్ని పక్షిజాతులు అంతర్థానమయ్యాయి. అయితే 1500 సంవత్సరం నుంచి చూస్తే నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణాలతో అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఒంటె మెడ గొడుగు పక్షి, హెల్మెటెడ్ హార్న్‌బిల్ వంటి ప్రఖ్యాత పక్షిజాతులు సైతం అంతరించిపోయే ప్రమాదముంది. ‘‘ ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి. అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలి. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలి’’ అని పరిశోధనలో కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్ వ్యాఖ్యానించారు.
విస్తృతస్థాయిలో పరిశోధన
వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఏఏ జాతి పక్షులపై అత్యధికంగా ఉందనేది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు పెద్ద కసరత్తే చేశారు. అంతరించిపోయే ప్రమాదమున్న శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, పక్షుల జాబితాను తెప్పించి అందులోని 10,000కుపైగా పక్షిజాతులపై సమగ్రస్థాయిలో అధ్యయనం చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు లోనయ్యే పెద్ద రెక్కల పక్షులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పెద్ద రెక్కల పక్షులు ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఈ పక్షులుండే అటవీ ప్రాంతాలు సైతం గనుల తవ్వకం, నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో కనుమరు గవుతు న్నాయి. ‘‘ ఆధునిక ప్రపంచంలో పక్షిజాతుల అంతర్థానం అనేది మరో అతిపెద్ద ముప్పు.
అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం’’ అని స్టీవార్ట్ అన్నారు. ‘‘ అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలి. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయి. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయి. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయి. రోజు లెక్కలేనన్ని కీటకాలను తిని పురుగుల అతి బెడదను నివారిస్తాయి. ఆకుల్ని, పూతను తిని చెట్లను నాశనంచేసే చిన్న కీటకాలను పక్షులు వేటాడి ఆయా ప్రాంతాల్లో చెట్లను పరోక్షంగా కాపాడతాయి. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూత, కాతకు కారణమవుతాయి.
అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన వందలాది పక్షిజాతులు కనుమరుగైతే జరిగే జీవావరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే తక్షణం అడవుల అనవసర నరికివేతకు స్వస్తి పలకాలి. వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలి. అరుదైన పక్షులను ప్రత్యేకంగా పెంచి వాటి సంతతిని వృద్ధి చెందించాలి’’ అని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి, ప్రొఫెసర్ మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు.