
చిత్తడి నేలల్లో కనిపించే పక్షులు 50% తగ్గుదల
గడ్డి భూములు మాయం కావడమే కారణం
ఈ–బర్డ్ సిటిజన్ సైంటిస్ట్‌ల అధ్యయనంలో వెల్లడి
942 పక్షి జాతుల్లో ప్రమాదం బారిన 204
ప్రస్తుతం తగ్గిపోతున్న 142 జాతులు
అనూహ్యంగా పడిపోయిన వలస పక్షుల రాక
సంరక్షణ చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి పెనుముప్పు
దేశంలో పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ప్రధానంగా గడ్డి భూములు, చిత్తడి నేలల్లో కనిపించే పక్షులు 50 శాతం వరకూ తగ్గినట్లు సిటిజన్ సైంటిస్ట్ పోర్టల్ ఈ–బర్డ్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ–బర్డ్ ప్లాట్ ఫాం ద్వారా 30 వేల మంది పక్షి ప్రేమికులు దేశంలో పక్షుల కదలికలను గమనిస్తూ వాటి ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా క్రోడీకరించి విశ్లేíÙంచగా దేశంలోని పక్షుల జనాభా, వాటి వైవిధ్యం ప్రమాదకర రీతిలో పడిపోతున్నట్లు తేలింది.
స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ –2023 నివేదిక ప్రకారం దేశంలో 942 పక్షి జాతులున్నట్లు గుర్తించారు. తాజా అధ్యయనంలో వీటిలో 204 చాలా సంవత్సరాలుగా, మరో 142 జాతులు ప్రస్తుతం తగ్గుతున్నట్లు తేలింది. మొత్తంగా 346 పక్షి జాతులు కనుమరుగయ్యే దశలో ఉన్నట్లు తేలింది. 29 శాతం జాతులు స్థిరంగా ఉండగా, 11 శాతం కొంచెం పెరిగాయి. తగ్గుతున్న వాటిలో 178 జాతులను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సిటిజన్ సైంటిస్టులు సూచిస్తున్నారు. –సాక్షి, అమరావతి
తగ్గుతున్న జాతుల్లో వలస వచ్చేవే ఎక్కువగా ఉన్నాయి. సైబీరియా తదితర ప్రాంతాల నుంచి శీతాకాలంలో భారత్‌లోని పలు ప్రాంతాలకు వచ్చే పక్షుల రాక తగ్గిపోయింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, చెరువులు, పొదలు కుంచించుకుపోవడంతో వలస పక్షుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లోనే 50 శాతం పక్షులు తగ్గిపోయినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో 557 పక్షి జాతులు ఉన్నట్లు గుర్తించగా వాటిలో 50 శాతం తగ్గాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో తరచూ కనిపించేవి ఇప్పుడు మాయమయ్యాయి.
గడ్డి భూములు, చిత్తడి నేలలు పక్షుల ఆవాసాలు. అవి అధిక శాతం నాశనం కావడంతో ఆహారం దొరకడం లేదు. పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, పెరిగిన కాలుష్యం, ఆక్రమణల కారణంగా చిత్తడి నేలలు, గడ్డి భూములు తగ్గిపోయాయి. పక్షుల ఆవాసాలు చెదిరి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ భూముల్లో ఉండే కీటకాలు, చిన్న జంతువులను తినే పక్షులు 25 శాతం కన్నా ఎక్కువ తగ్గాయి. పండ్లు, తేనె, తామరలు తినేవి మాత్రం స్థిరంగా ఉన్నాయి.
తగ్గిపోతున్న కొన్ని పక్షులు
1. బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్)
2. పిచ్చుకలు (హౌస్ స్పారో)
3. పాలపిట్ట (ఇండియన్ రోలర్)
4. నల్ల మెడ కొంగ (బ్లాక్–నెక్డ్ స్టార్క్)
5. గద్దలు (ఈగల్)
6. అమూర్ ఫాల్కన్ (వలస పక్షి)
7. సైబీరియన్ కొంగ (సైబీరియన్ క్రేన్)
8. నల్లతోక పక్షి, బ్లాక్–టైల్డ్ గాడ్‌విట్
9. నార్తర్న్ పింటెయిల్
10. ఫ్లెమింగోస్
అతక్షణ చర్యలు అవసరం
పక్షి జాతుల సంరక్షణకు తక్షణం చర్యలు తీసుకోకపోతే మనుగడకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణానికీ పెనుముప్పు అని చెబుతున్నారు. గడ్డి భూములు, చిత్తడి నేలలను కాపాడడం, స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో పక్షుల వైవిధ్యం వేగంగా తగ్గిపోతోందని బెంగుళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కి చెందిన జీవ వైవిధ్య నిపుణుడు వివేక్ రామచంద్రన్ స్పష్టం చేశారు.