ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సమీకృత కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే సమావేశాలకు సంబంధిత మండల, డివిజన్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, స్టేట్ ప్రజావాణి కోఆర్డినేటర్ రాకేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం మార్కెట్‌పై పీఐసీ ఏర్పాటు చేయాలి
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెంటనే ప్రత్యేక అధికారుల కమిటీ నియమించి పరిపాలనను సజావుగా కొనసాగించాలని మాజీ చైర్మన్ వీరమల్ల రామ్ నరసింహాగౌడ్ కలెక్టర్‌ను కోరారు.
తప్పుడు ధ్రువపత్రాలపై చర్యలు తీసుకోండి
తండ్రి చనిపోకముందే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తిపై సమగ్ర విచారణ చేపట్టాలని షాద్‌నగర్‌కు చెందిన ఆకాష్ నాయక్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కేశంపేటకు చెందిన అనంతయ్య జీపీఓగా పని చేస్తున్నాడని, అతనిపై విచారణ చేయాలని కోరారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


