అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం జాఫర్‌గూడలో ఏర్పాటు చేసిన నోవా మెడికల్ కాలేజీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాలేజీ గేటు ఎదుట ఽసోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఎలాంటి వసతులు లేకున్నా కాలేజీకి గుర్తింపు ఎలా ఇచ్చారో ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. పేరుకే 21 డిపార్టుమెంట్స్ ఉన్నాయని, అన్ని విభాగాల్లో పనిచేసేందుకు కావాల్సిన సిబ్బంది మాత్రం లేరన్నారు. ఎంబీబీఎస్ చదివే 250 మందికి సరిపడా క్లాస్ రూమ్స్ లేవని, నాణ్యమైన ప్రొఫెసర్స్, రీడర్స్, ట్యూటర్స్ లేరన్నారు. రాష్ట్రంలో 1985 నుంచి నడుపుతున్న ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఇప్పటి వరకు 250 యూజీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించని వైద్యాధికారులు నోవా మెడికల్ కాలేజీకి మాత్రం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అవినీతి అధికారులను డిస్మిస్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థిఽ సంఘం నాయకులను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్


