జైల్‌ భరోను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

జైల్‌ భరోను జయప్రదం చేయండి

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

జైల్‌ భరోను జయప్రదం చేయండి ప్రజా భవన్‌లో రావిర్యాల ఎల్లమ్మ ఘటం ఊరేగింపు యువ శాస్త్రవేత్తకు సన్మానం ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్‌ టోర్నీ

తుర్కయంజాల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్‌ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్‌, ఉపాధ్యక్షుడు డి.కిషన్‌ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్‌ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్‌ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్‌ రెడ్డి, లాయర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకుడు కె.అరుణ్‌ కుమార్‌, నాయకులు ఐ.భాస్కర్‌, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు.

తుక్కుగూడ: ఆషాఢ మాసం సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజా భవన్‌లో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఇందులో రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఘటం పాల్గొంది. ఈ ఘటానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీగడ కాశీనాథ్‌ ప్రజా భవన్‌లో అమ్మవారి ఘటాన్ని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రెడ్డిగళ్ల రత్నం తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: భారత అంతరిక్ష రంగంలో మొదటి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ అయిన విక్రమ్‌ –1 విజయయాత్రలో షాద్‌నగర్‌కు చెందిన యువ శాస్త్రవేత్త నిఖిల్‌ మద్దూరి కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆయన షాద్‌నగర్‌ విచ్చేసిన సందర్భంగా జాతీయ బీసీ సేన నాయకులు ఘనంగా సత్కరించారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన బృందంలో యువ శాస్త్రవేత్త నిఖిల్‌ ఉండటం ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్‌, నాయకులు ప్రకాష్‌, ప్యాట జయ, శ్రీకాంత్‌, గిరిబాబు, సింగారం శ్రీనివాస్‌, భువనచంద్ర తదితరులు ఉన్నారు.

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 32 టీమ్‌లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్‌, రెండో బహుమతిని పడకల్‌, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్‌ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్‌ కానుగుల అనిత మల్లేశ్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ పులిజాల మహేశ్‌, స్థానిక నాయకులు కుమ్మరి శంకర్‌, శంకర్‌ నాయక్‌, రవి, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement