సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంతో పాటు ఇతర పట్టణాల్లోనూ చెత్త నిర్వహణ పెను సవాల్‌గా మారుతోంది. దశాబ్దాల క్రితం నాటి డంపింగ్ యార్డులు నిండిపోతున్నాయి. కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఇది ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఈ క్రమంలోనే చెత్త నుంచి సిరులు కురిపించే నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతోంది. వంటింటి వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోకంపోస్ట్ ఎరువు, బయో సీఎన్‌జీ తయారీ కేంద్రాల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 20 వేల టన్నుల కంప్రెస్‌డ్ బయో గ్యాస్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
కొత్తగా 12 ప్లాంట్లు..
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో అత్యధిక భాగం గ్రేటర్ పరిధిలోనే ఉంటోంది. రోజుకు సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ఇందులో 1,587 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, 31 టన్నులు బయోమెడి కల్ వ్యర్థాలు, సుమారు 80 శాతం తడి చెత్త ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సీబీజీ ఉత్పత్తి ప్లాంట్ నడుస్తోంది. రోజుకు 5 టన్నుల వరకు సీబీజీ ఉత్పత్తి అవుతోంది. ఇందులో రెండు టన్నులకు పైగా భాగ్యనగర్ గ్యాస్ ఏజన్సీకి విక్రయిస్తుండగా.. అక్కడి నుంచి గృహావసరాలకు సరఫరా చేస్తు న్నారు. మిగతాది నగరంలో చెత్త సేకరించే వాహనాలకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇది విజయ వంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 12ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన సంస్థలు సీబీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
సీబీజీతో రూ.218 కోట్ల ఆదాయం
రాష్ట్రంలో కొత్తగా మరో 12 సీబీజీ యూనిట్ల ఏర్పాటుకు వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నా యని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 20 వేల టన్నుల కంప్రెస్‌డ్ బయో గ్యాస్ అందుబాటులోకి రానుందని అంచనా. ప్రస్తుతం సీఎన్‌జీ కేజీ రూ.109 ఉంది. అంటే చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తితో సుమారు రూ.218 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం వాహన రంగాన్ని వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సీబీజీని వినియోగించుకోవచ్చు. ఫలితంగా మెరుగైన మైలేజీతో పాటు, నగరంలో వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుందని పీసీబీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉన్న 48 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లతో చెత్త సమస్య తీరుతుందని, కొత్త స్థలాలను వెతకాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ అంచనా.
వ్యర్థాల నుంచి బయో సీఎన్‌జీ తయారీకి ముందుకొస్తున్న సంస్థలు
పెట్రోల్, డీజిల్ ధరల మోతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రాష్ట్రంలో 12 కంప్రెస్‌డ్ బయో గ్యాస్ యూనిట్లకు అనుమతులు
ఏటా 20 వేల టన్నుల సీబీజీ ఉత్పత్తి సామర్థ్యం
గ్రేటర్ పరిధిలో నిత్యం 12 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి


