న్యూస్‌రీల్
వారం నుంచి పడిగాపులు
డబ్బులిస్తేనే తూకం
మంచాల: ఓ వైపు వర్షాలకు ధాన్యం తడుస్తుంటే.. నిర్వహకుల చేయి తడిపితే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచాల కొనుగోలు కేంద్రంలో 140 మంది రైతుల నుంచి 11,919 సంచుల, 4,767.20 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. మిల్లులకు తరలిచేందుకు లారీలు రాక 2,786 సంచుల్లో 1,114.40 క్వింటాళ్ల ధాన్యం సెంటర్‌లోనే డంప్ అయింది. మరో 45 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది. లోయపల్లి సెంటర్‌లో 294 మంది రైతుల నుంచి 762 క్వింటాళ్ల ధాన్యం తరలించగా 60 శాతం ధాన్యం తూకం వేయాల్సి ఉంది. నోములలో 119 మంది రైతుల నుంచి 2,400 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. 40 శాతానికి పైగా ధాన్యం ఎత్తాల్సి ఉంది. నిర్వహణ లోపం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఇదే విషయమై డీసీఎంస్ అధికారి రాజును వివరణ కోరగా తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని బదులిచ్చారు.
వారం క్రితం ధాన్యం బస్తాలు తీసుకొచ్చాం. సకాలంలో కాంటా వేయకపోవడంతో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలు తడిసాయి. టార్పాలిన్లు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం.
– ఈరటి కృష్ణ, రైతు, లోయపల్లి
లోయపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అన్యాయం జరుగుతోంది. తూకంలో కోతలు విధిస్తున్నారు. అక్కడ పనిచేసే లచ్చిరాం అనే వ్యక్తికి డబ్బు ఇస్తేనే తూకం వేసి తరలిస్తున్నాడు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బోడకొండలో మరింత అధ్వాన్నంగా మారింది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– కొర్ర లింగ నాయక్, వార్డుసభ్యుడు, లోయపల్లి


