నౌహీరా షేక్.. భారీ స్కాములు.. నకిలీ పేర్లు
సాక్షి, సిటీబ్యూరో: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముసుగులో వివిధ రకాలైన స్కీముల పేరుతో రూ. మూడు వేల కోట్లకు పైగా స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ వ్యవహారాలు అన్నీఇన్నీ కావు. స్కామ్‌లు వెలుగులోకి వచ్చిన తర్వాత అరెస్టులు... బెయిల్ పొందటం, అది రద్దైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాజాగా ఈడీ అధికారులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా తన పేరు మునీరా అని..నౌహీరా కాదని తప్పు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అప్పట్లో హీరా గ్రూప్ అధికారిక వెబ్‌సైట్‌లోని అచీవ్‌మెంట్స్ లింకులో నౌహీరా సాధించిన విజయాలుగా చెప్తూ చాంతాడంత జాబితా ఉండేది. ఇందులో అనేక అవార్డుల పేర్లు, వాటి వివరాలను సైతం పొందుపరిచారు. దీని ప్రకారం నౌహీరాకు 2012 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంఽధీ ప్రియదర్శిని అవార్డు ప్రదానం చేసినట్లు ఉంది. దీంతో పాటు మొత్తం 11 రకాలైన జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తమ జాబితాలో చేర్చుకున్నారు. వీటిని సంబంధించిన కొన్ని ఫొటోలనూ నౌహీరా సోషల్ మీడియాతో పాటు తన కార్యాలయం, ఇళ్ళల్లో ప్రదర్శించేశారు. వీటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు అవన్నీ నకిలీవిగా తేల్చారు. అనేక ఫొటోలను ఫొటోషాప్ ద్వారా మార్చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
బెయిల్ రద్దు అయితే పరారే...
నౌహీరా షేక్‌ను తొలిసారిగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 2018 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. ఆపై ఈడీ అధికారులు కటకటాల్లోకి పంపారు. సీసీఎస్‌లో నమోదైన కేసుల్లో నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన నౌహీరా బెయిల్ పొందారు. ఇదే తరహా కేసులో 2021లో ముంబై పోలీసులు అరెస్టు చేయగా... డిపాజట్లు తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చి బెయిల్‌పై బయటకు వచ్చారు. సీసీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను పోలీసులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. నేరం తీవ్రత, కేసుల పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ 2024 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నౌహీరా 2025 మేలో హర్యానాలో చిక్కింది.
ఐయామ్ మునీరా అంటూ తప్పించుకునే యత్నం
తాజాగా ఈడీ కేసులోనూ సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఎట్టకేలకు గత వారం గురుగ్రామ్‌లో ఆచూకీ కనిపెట్టిన ఈడీ అధికారులు నౌహీరాను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చి జైలుకు పంపారు. నకిలీ పత్రాలు సృష్టించి గురుగ్రామ్‌లో తలదాచుకున్న నౌహీరా.. తనను అరెస్టు చేయడానికి వచ్చిన ఈడీ అధికారులనూ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారు. అక్కడి ఓ అద్దె ఇంట్లో ఆమెను గుర్తించగా.. దాదాపు గంటసేపు తాను నౌహీరాను కాదంటూ వాదించింది. తన పేరు మునీరా అంటూ ఆమె పదేపదే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే అధికారులు కొన్ని ఆధారాలు చూపడంతో మిన్నకుండిపోయింది.
తొలినాళ్లల్లో ప్రముఖులతో
ఫొటోలు క్రియేట్
ఆపై బెయిల్ రద్దు అయినప్పుడల్లా ఎస్కేప్
తాజాగా ఈడీ అధికారులను
మోసం చేసే యత్నం


