శంకర్‌పల్లి: పొట్టకూటి కోసం.. కుటుంబ పోషణ కోసం.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బతుకున్న కార్మికుల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మండలంలోని మహాలింగపురం ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం ఐదుగురు కార్మికులను బలితీసుకున్న విషయం తెలిసిందవే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పింటు (30) తలకు బలమైన గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. పవన్ కుమార్ (26) రెండు కాళ్లు విరిగాయి. వీర బహదూర్ (25)కు తుంటి ఎముకతో పాటు, పక్కటెముకలు విరగ్గా.. మిఽథున్(26)కు పాదంలో చీలిక వచ్చింది. మిగిలిన ఎనిమిది మందికి ఎముకల్లో ఎయిర్ గ్యాప్‌తో పాటు పాక్షికంగా గాయాలయ్యాయి. చనిపోయిన ఐదుగురు కార్మికుల మృతదేహలకు మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు తరలించారు.
ప్రమాణాలు పాటిస్తున్నారా?
ఎన్‌సీసీ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసింది. కంపెనీపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కంపెనీ ప్రతినిధులు చాలాసేపటి వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని వెళ్లిన మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించకపోవడం, దర్యాప్తు అధికారులు వచ్చినప్పుడు సైతం అలాగే వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది. కంపెనీ యాజమాన్యం కార్మికుల భద్రత కోసం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
దర్యాప్తు ప్రారంభం..
ఎన్‌సీసీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్‌బాబు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మనోహర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రతిమ కంపెనీకి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసి, పరిసరాలను పరిశీలించారు. ఈదురుగాలుల కారణంగా 75నుంచి 80టన్నులు ఉండే మూవబుల్ గ్యాండ్రీ క్రేన్లు అసలు ఎలా కదిలాయని, ఆ అవకాశం ఉందా, ఇంకేదైనా టెక్నికల్ సమస్య కారణమా.. అని విచారిస్తున్నారు.
బాధిత కుటుంబాలకు పరిహారం
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఎమ్మెల్యే యాదయ్య వెల్లడించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.25 లక్షలచొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, పాక్షిక గాయాలైన వారికి రూ.50 వేల పరిహారంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు కంపెనీయే భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా మరణించిన వ్యక్తి ఉద్యోగ విరమణ కాల పరిమితి వరకూ నెల వేతనం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికులకు అందించే నష్టపరిహారానికి సంబంధించిన ప్రకటనపై మంత్రి, కలెక్టర్‌తో చర్చించినట్లు తెలిపారు.
ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ప్రమాదం ఘటన
కార్మికుల కుటుంబాల్లో విషాదం
ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
గాయపడిన కార్మికులకు మంత్రి వివేక్ పరామర్శ


