అవినీటి చెరువులో..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు.. మాంసం ప్రియులకు మేలిమి రకం చేపల రుచి చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు పక్కదారి పట్టాయి. పక్కాగా అమలు చేయాల్సిన జిల్లా మత్స్యశాఖ అధికారులు బోగస్ లబ్ధిదారులతో కుమ్మకై ్క నిధులు స్వాహా చేశారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్‌వై), బ్లూ రెవల్యూషన్ స్కీం(బీఆర్‌ఎస్), రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన (ఆర్‌కేవీవై) పథకాల కింద రూ.ఐదు కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. చేపల పెంపకంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు తమకున్న రాజకీయ పలుకుబడితో నిధులను కొల్లగొట్టినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
నిధులు పక్కదారి
ఆయా పథకాల కింద 2018 నుంచి 2025 మధ్య కాలంలో జిల్లాకు పలు యూనిట్లను కేటాయించారు. ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడంలో ఆరితేరిన బోగస్ వ్యక్తులకు అప్పటి అధికారుల అండదండలు పుష్కలంగా అందాయి. చేపల పెంపకం వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు దక్కాల్సిన సబ్సిడీ నిధులు పక్కదారి పట్టాయి. ఈ అంశపై రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. అధికారులు సైతం తమ తనిఖీల్లో నిధులు పక్కదారి పట్టిన అంశాన్ని గుర్తించారు. వాటిని తిరిగి వెనక్కి తీసుకురావడంలో.. ఇందుకు సహకరించిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనుకాడుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మచ్చుకు కొన్ని బోగస్ చెరువులు
● మొయినాబాద్ మండలం పెద్దమంగాళారం రెవెన్యూ సర్వే నంబర్ 99లో ఎకరం విస్తీర్ణంలో ఆర్‌ఏఎస్ రౌండ్ ట్యాంక్ ఉన్నట్లు చూపించారు. రూ.30 లక్షలు సబ్సిడీ పొందారు. తీరా తనిఖీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తే ట్యాంకు లేదు. అందులో చేపలు కన్పించలేదు.
● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు సర్వేనంబర్ 60,70,76లో రూ.50 లక్షల అంచనా వ్యయంతో 365 చదరపు గజాల విస్తీర్ణంలో ఆర్‌ఏఎస్ రౌండ్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపలు పెంచుతున్నట్లు చూపించారు. అప్పటికే రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. తనిఖీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ట్యాంకు లేదు, చేపలు లేవు. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్ కూడా నకిలీగా నిర్ధారణ అయింది.
● ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్లు 213/1, 214/1లో 1.05 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌ఏఎస్ రౌండ్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు చూపించారు. ఆర్‌కేవీవై పథకం కింద రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. తీరా అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అక్కడ ట్యాంకు లేదు. చేపలు లేవు.
● గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 62/2/1లో 1.03 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌ఏఎస్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపపిల్లలు పెంచినట్లు చూపించారు. అప్పటికే రూ.20 లక్షల సబ్సిడీ పొందారు. అధికారులు వెళ్లి పరిశీలిస్తే ట్యాంకు లేదు.. చేపలు లేవు.
● ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు రెవెన్యూలోని సర్వే నంబర్ 470లో 375 గజాల విస్తీర్ణంలో ఆర్‌ఏఎస్ రౌండ్ ట్యాంక్ నిర్మించి, అందులో చేపలు పెంచుతున్నట్లు చూపించి ఆర్‌కేవీవై పథకం కింద రూ.25 లక్షల సబ్సిడీ పొందారు. ఫిర్యాదులు రావడంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, తనిఖీ చేయగా ట్యాంకు లేదు.. అందులో చేపలు లేవు.
బోగస్ లబ్ధిదారులు, అధికారులు కుమ్మక్కు
క్షేత్రస్థాయిలో కన్పించని చెరువులు.. చేపలు
పథకాల పేరుతో నిధుల స్వాహాపర్వం
చర్యలు తీసుకోవడంలో ‘మీన’మేషాలు
ఇది ఇబ్రహీంపట్నంలోని షేరిగూడ ప్రాంతం. సర్వే నంబర్ 46/ఈ/1లోని 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువు ఉన్నట్లు, అందులో చేపలు పెంచుతున్నట్లు కొంతమంది రూ.3.75 లక్షల రాయితీ పొందారు. తీరా అధికారులు అక్కడికి వెళ్లి చూస్తే చెరువే మాయమైంది. చేపలు ఎటు వెళ్లాయో తెలియని పరిస్థితి.
ఒక్క షేరిగూడలోనే కాదు జిల్లాలోని పెద్దమంగళారం, రాందాసుపల్లి, వట్టినాగులపల్లి, మునగనూరు రెవెన్యూ కేంద్రంగా బోగస్ లబ్ధిదారులు బయటపడ్డారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి పథకాలు పొందిన వారిపైనే కాదు.. లేని చెరువులు, చేపలను ఉన్నట్లు చూపించి, వారికి సహకరించిన జిల్లా మత్స్యశాఖ అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.


