యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్మాసిటీ భూ పరిహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. దీంతో తాను పైసా ఎవరి వద్దనైనా తీసుకుంటే రాజకీయాలే వదిలేస్తానని.. నక్కర్తమేడిపల్లికి వస్తాను.. రైతుల వద్దే తేల్చుకుందామని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ చేసి చర్చకు రావాలని డిమాండ్ చేసింది తెలిసిందే. ఈ క్రమంలో గ్రామ బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామ చౌరాస్తాలో వేసిన టెంట్లను బీఆర్‌ఎస్ శ్రేణులు తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టి గ్రామంలో 144 సెక్షన్ విధించారు.
తోపులాట, బీఆర్‌ఎస్ నేతలకు గాయాలు
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి నక్కర్తమేడిపల్లికి వచ్చారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు చేసిన వ్యక్తి చర్చకు రాకుంటే ఎలా అని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులను కందుకూరు, మహేశ్వరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో జరిగిన తోపులాటలో మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తా వద్ద బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోటీగా నక్కర్తమేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి మాడ్గుల్ పోలీస్‌స్టేషన్ తరలించారు.
నిరాధారమైన ఆరోపణలు
మహేశ్వరం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తమపై నిరాధారమైన, పసలేని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. నక్కర్తమేడిపల్లిలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్‌రెడ్డి రంగారెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెలరోజుల్లో తాము చేసిన అవినీతిని నిరుపించాలని, లేదంటే ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీ పరిహారం వసూళ్లపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఆరోపణలు
చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్
మంచిరెడ్డి రాక కోసం ఏర్పాట్లు చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు
బీఆర్‌ఎస్ నాయకులు వేసిన టెంట్లను పీకేసిన కాంగ్రెస్ శ్రేణులు
ఇరు వర్గాలను అరెస్టు చేసిన పోలీసులు


