ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ కె.రామారావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. 2వ పీఆర్‌సీ కమిటీ వేసి 30 నెలలు గడుస్తున్నా నివేదిక రాకపోవడం సిగ్గు చేటన్నారు. నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో జూన్‌ 2వ తేదీలోపు పీఆర్‌సీని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలన్నారు. కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, ఉద్యోగులు, పెన్షనర్ల, ఆరోగ్య భద్రత కోసం నగదు రహిత చికిత్సను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. లేదంటే తదుపరి కార్యాచరణ అమలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనేష్‌ కుమార్‌ నోరీ, మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌, గోపాల్‌ నాయక్‌, పూర్ణచందర్‌, శాంతిశ్రీ, సైదమ్మ, రాకేష్‌, యశ్వంత్‌, అనిత తదితరులు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పీఆర్‌సీ, ఓపీఎస్‌ను తక్షణమే అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేస్తూ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ టీజీఈ జేఎసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నిరసన తెలిపారు. ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ తుల్జాప్రసాద్‌రావు, పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులతో కలిసి భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సూరిబాబు, రజినీకాంత్‌ రెడ్డి, రాజశేఖరరెడ్డి, శివప్రసాద్‌, బబిత, మండలపరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement