సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నం: 2026 జనాభా లెక్కల అనంతరం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు సీపీఎం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పాకిస్తాన్, ఇండియా చీల్చిన చందంగా పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు సామెల్, జగదీశ్, జగన్, నర్సింహ, బుగ్గరాములు, ప్రకాశ్‌కారత్ పాల్గొన్నారు.


