చేవెళ్ల: అనారోగ్యంతో ఆసస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి బాత్‌రూమ్‌లో కాలుజారి పడిపోయి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని పట్నం మహేందర్‌రెడ్డి జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్‌శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామానికి చెందిన వి.మల్లేశ్(32) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేదని ఈనెల 13వ తేదీన చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కిడ్నీకి సంబంధించి ఆపరేషన్ చేశారు. శుక్రవారం అతడు ఆస్పత్రిలో బాత్‌రూమ్‌కని వెళ్లి కాలుజారి పడిపోవటంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే వైద్యులు పరిశీలించగా తలకు తగిలిన బలమైన గాయంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పైసాబారీష్ కేసులో మరో నిందితుడి రిమాండ్
షాద్‌నగర్‌రూరల్: పైసా బారీష్ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ సీతారాం కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల మధు అలియాస్ రవికి బ్రహ్మయ్య అలియాస్ అన్నారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి మోసపూరితంగా డబ్బులు సంపాదించాలని తక్కువ ధరకే బంగారం ఇస్తామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టీఆర్ జిల్లా కంచికర్లకు చెందిన మక్బూల్‌బాషా, రామ్మోహన్‌కు ఫోన్‌చేసి రూ.10 లక్షలు ఇస్తే బారీష్ పూజలు చేసి రూ.30లక్షలు ఇస్తామని నమ్మించారు. వారిని డబ్బులు తీసుకొని షాద్‌నగర్‌కు రావాలని చెప్పారు. దీంతో ఎలాగైనా వారి నుంచి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో మధు అలియాస్ రవి తన గ్రామానికి చెందిన స్నేహితులు బింగి వెంకటేష్, మహిపాల్, తన బంధువు చంద్రశేఖర్‌తో కలిసి షాద్‌నగర్‌లోని సీఎస్కే విల్లాలోకి వచ్చాడు. అక్కడికి వచ్చిన మక్బూల్‌బాషా, రామ్మోహన్‌లను బెదిరించి వారినుంచి రూ.9లక్షల నగదును లాక్కొని పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా పైసాబారీష్ కేసులో పరారీలో ఉన్న నిందితుడు పిచ్చకుంట్ల మధు అలియాస్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు.
పోక్సో నిందితుడికి పదేళ్ల జైలు
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీనగర్ న్యాయస్థానం శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో మహ్మద్ షఫీ ఖాన్(22)అల్‌జాబ్రీ కాలనీలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
వడదెబ్బతో రైతు మృతి
మొయినాబాద్ రూరల్: వడదెబ్బతో రైతు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పట్నం నర్సింహారెడ్డి శుక్రవారం వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా ఎండ వేడిమిని భరించలేక సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన పక్క పొలాల రైతులు, కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మద్యపాగ కృష్ణ కోరారు.
యాలాల: మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సింలు(50)శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న తాండూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ సంపత్‌కుమార్, బండమీదిపల్లి సర్పంచ్ నరేష్‌కుమార్ అంత్యక్రియల నిమిత్తం మృతుడి భార్య దేవమ్మకు ఆర్థిక సాయం అందించారు.
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి
పూడూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల సతీష్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర తీరుకు నిరసనగా ఈ నెల ఽ18న నగరంలోని ఇందిరా పార్ వద్ద నిర్వహించే మహాగర్జన కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ధరలు పెరగడం, నిరుద్యోగం, రైతు సమస్యలు సామాస్య ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు తలపట్టిన మహాగర్జనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


