యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే శుక్రవారం ప్రారంభమైంది. సర్వే నంబరు 127లో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్ప సర్వేతీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఓ ఆర్‌ఐతో పాటు ముగ్గురు సర్వేయర్లు, మరో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. సర్వేనంబరు 127లో మొత్తం 122.02 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 108.30 ఎకరాలను రైతులకు పంపిణీ చేశారు. 127లోని అసైన్డ్ భూమికి హద్దులు గుర్తించి, ఆవెంటనే ఫెన్సింగ్ వేయనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది భూముల వద్దకు వచ్చినప్పుడు రైతులు ఫొటోలు దిగాలని, ఈసమయంలో పక్క రైతుల అభిప్రాయం కూడా సేకరించి, వివరాలు నమోదు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
నెల రోజుల్లో పరిహారం
మొండిగౌరెల్లి అసైన్డ్ భూముల సర్వే పూర్తి చేసిన వెంటనే జనరల్ అవార్డు పాస్ చేసి, అర్హులైన వారికి నెల రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు. ఇందుకోసం టీజీఐఐసీ నుంచి రూ.వంద కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. యాచారం మండలానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లి అసైన్డ్ భూములను లాజిస్టిక్ పార్క్‌ల కోసం తీసుకునే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సమీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కోలన్ రమాదేవి, పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19, 68, 127 సర్వేనంబర్లలో నకిలీలపై ఆరా తీశారు. ఆయా నంబర్లలో 1972 నుంచి నింబంధనల ప్రకారం ఎంతమంది రైతులకు భూములు అసైన్ చేశారనే వివరాలపై ఆరా తీశారు. ఇందులో ఎంతమంది నకిలీ రైతులు ఉన్నారు..? ఏ సంవత్సరంలో వీరికి హక్కులు దక్కాయి..? అప్పుడు ఉన్న అధికారులు, పాలకులు ఎవరు..? అనే విషయాలపై వివరాలు వెలికితీయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. భూసేకరణ జాబితాలో నకిలీల పేర్లు వచ్చినప్పటికీ మరోసారి రికార్డులు పరిశీలించి, తొలగిస్తామన్నారు. రైతులందరూ సర్వేకు సహకరించాలని కోరారు.
అసైన్డ్ భూముల హద్దులు గుర్తిస్తున్న రెవెన్యూ అధికారులు
ఆ వెంటనే 127, 68, 19 సర్వేనంబర్ల చుట్టూ ఫెన్సింగ్
సిబ్బందికి సూచనలు అందించిన ఆర్డీఓ అనంతరెడ్డి
అసైన్డ్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయొచ్చని వెల్లడి


