తమిళనాడు దొంగల పనేనా? | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు దొంగల పనేనా?

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

పాల రైతుపై మత్తుమందు చల్లి రూ.10 లక్షలు దోపిడీ

బ్యాంకు వద్ద లావాదేవీలను గమనించి, బైక్‌లపై అనుసరించిన దుండగులు

కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టిన పోలీసులు

కందుకూరు: కుమారుడి పెళ్లి నిశ్చితార్థం కోసం బ్యాంకు నుంచి ఇంటికి నగదు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిపై మత్తు మందు చల్లి రూ.10 లక్షలు దోచుకెళ్లిన దొంగలు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ఢిల్లీ నారాయణ వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తాడు. ఈ నెల 19న తన కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. డబ్బు అవసరం కావడంతో గురువారం మధ్యాహ్నం పాల వ్యాపారం ముగించుకుని, నగదు డ్రా చేసేందుకు కందుకూరు చౌరస్తాలోని ఎస్‌బీఐకి వచ్చాడు. ఒకేసారి అంత క్యాష్‌ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేయడానికి వచ్చిన వారి వద్ద రూ.10 లక్షలు తీసుకుని, తన ఖాతా నుంచి వారి అకౌంట్‌కు చెక్కు ద్వారా చెల్లించాడు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో నగదు తీసుకుని సమీపంలో పార్కు చేసిన తన బైక్‌ వద్దకు వచ్చి సైడ్‌ బాక్స్‌లో పెట్టుకుని, ఇంటికి బయలుదేరాడు. ఇదంతా గమనించిన నలుగురు దుండగులు బైక్‌లపై నారాయణను అనుసరించారు. కందుకూరు దాటిన తర్వాత అతనిపై మత్తు మందు చల్లి డబ్బు తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సీసీ పుటేజీల పరిశీలన

కేసు విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంకుతో పాటు రహదారి వెంబడి షాపుల ముందు ఉన్న సీసీటీవీ కెమెరా పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యాంకులో జరిగిన లావాదేవీలు చూసిన నలుగురు వ్యక్తులు బైక్‌లపై నారాయణను అనుసరిస్తూ వెళ్లడాన్ని గుర్తించారు. వారి నడవడిక, దోపిడీ తీరు ఆధారంగా తమిళనాడుకు చెందిన వారని ప్రాథమికంగా నిర్ధారించారు. దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement