● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
● తుమ్మలూరులో ప్రజా పాలన గ్రామ సభ
మహేశ్వరం: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ్ణారావు అన్నారు. తుమ్మలూరు పంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 2047 విజన్‌తో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశమని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ సంగారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఈఓ సుశీందర్‌రావు, జిల్లా అధికారులు శ్రీలత, సురేష్, వనజాత, శ్రీలక్ష్మి, లలితాదేవి, తహసీల్దార్ చిన్న అప్పల నాయుడు, ఎంపీడీఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.


