● చెన్‌గేస్‌పూర్ సొసైటీ సభ్యుల
పరస్పర వాగ్వాదం
● రెండువర్గాలుగా విడిపోయిన
సంఘం సభ్యులు
తాండూరు రూరల్: కల్లు విక్రయం విషయంలో ఇరువర్గాల వారు ఎమ్మెల్యే ఎదుటే పరస్పరం దూషించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని కొత్లాపూర్ ఎల్లమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్‌గేస్‌పూర్ గ్రామానికి సంబంధించిన కల్లు సొసైటీ సభ్యులు కొత్లాపూర్‌కు చేరుకున్నారు. ఈసారి గ్రామంలోనే కల్లు తయారు చేసుకుని విక్రయిస్తామని, రెండేళ్లుగా బయటి వ్యక్తులే కల్లు అమ్ముకుంటున్నారని సొసైటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే సొసైటీ సభ్యుల కోరిక మేరకే రవిగౌడ్ అనే వ్యక్తికి అవకాశం ఇచ్చామని, ఇప్పుడు కాదంటే అంగీకరించేది లేదని అక్కడే ఉన్న మరికొందరు సభ్యులు తెలిపారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరగడంతో తర్వాత మాట్లాడుకుందామని చెప్పిన ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈవిషయమై చెన్‌గేస్‌పూర్ సర్పంచ్ ప్రవీణ్‌గౌడ్ మాట్లాడుతూ.. డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్ రెండేళ్లుగా తమ గ్రామంలో కల్లు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈసారి సొసైటీ మెజార్టీ సభ్యుల అంగీకారంతో తామే కల్లు అమ్ముకుంటామని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఈవిషయమై రవిగౌడ్ తనను ఎమ్మెల్యే ఎదుటే బెదిరించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కల్పించుకుని సొసైటీకి న్యాయం చేయాలన్నారు. మెజార్టీ సభ్యుల అంగీకారం, సొసైటీ చైర్మన్ అనుమతితోనే తాను కల్లు విక్రయిస్తున్నానని రవిగౌడ్ తెలిపారు.


