బంట్వారం: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన కోట్‌పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై ంది. ఇందుకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. గుడ్ గవర్నెన్స్ విభాగంలో మెత్కుపల్లి జీపీ తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. దేశ వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి సుస్థిర పరిపాలన లక్ష్య సాధనలో ముందంజలో నిలిచిన మోత్కుపల్లి జీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అవార్డు అందుకోనుంది. ఈ నెల 24న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో అవార్డు ప్రదానం చేయనుంది. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల మోత్కుపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


