వివరాలు వెల్లడించిన ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు
ఆమనగల్లు: ఆమనగల్లు మండలం సీతారాంనగర్‌తండా గ్రామ పరిధిలోని పులుగోనిపల్లితండాలో మంగళవారం భార్య, కొడుకును హత్య చేసిన నిందితుడు పులుగోనిపల్లితండాకు చెందిన బానావత్ రాందాస్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన రాందాసు మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో భార్య కవిత, కుమారుడు హర్షరోహిత్, కుమార్తె ప్రణీతపై రోకలితో దాడి చేశాడని ఆయన వివరించారు. ఈ ఘటనలో కవిత, హర్షరోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా ప్రణీత తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. అనంతరం ఆమనగల్లు ఎస్‌ఐ సీతారాంరెడ్డి, ఏఎస్‌ఐ రాంరెడ్డి, పోలీసులు రజనీకాంత్, టైటస్ లక్ష్మణ్ నిందితుడు రాందాస్‌ను బుధవారం పట్టుకున్నారని ఆయన చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.


